ఏఐటీయూసీలో చేరిన ఆర్టీసీ కార్మికులు

05-11-2026 | 10:03pm
  1. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలి
  2. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి) : మంచిర్యాల ఆర్టీసీ డిపోలో(Mancherial RTC Depot) పనిచేస్తున్న పలువురు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లు, కండక్టర్లు ఏఐటీయూసీ కార్మిక సంఘంలో చేరారు. ఈ సందర్భంగా వారిని సంఘం నాయకులు(Association leaders) ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు మాట్లాడుతూ.. ఆర్టీసీలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ వారికి ఉద్యోగ భద్రత లేకపోవడంతోపాటు, సకాలంలో వేతనాలు అందక, తక్కువ వేతనాలు, పని ఒత్తిడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించడంతోపాటు కార్మిక చట్టాల ప్రకారం హక్కులు, సౌకర్యాలు అందించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని, హక్కుల సాధనకు కార్మికులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రాంతీయ అధ్యక్షుడు మామిడిపల్లి శ్రీనివాస్, డిపో కార్యదర్శి గోలి శంకర్, శంకరాచారి, అంజయ్య, సర్వర్ పాషా, రాజు, భారతి, సుమలత, పానుగంటి సత్యనారాయణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు