పరీక్ష ఫీజుల పేరుతో అదనపు వసూళ్లు
- ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలి
- విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి) : పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజుల(Intermediate exam fees) పేరుతో విద్యార్థుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై(Private educational institutions) చర్యలు తీసుకోవాలని విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పదో తరగతి పరీక్ష ఫీజు ప్రభుత్వం రూ.125గా నిర్ణయించగా, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు రూ.800 నుంచి రూ.1,200 వరకు వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఆర్ట్స్, సైన్స్ విద్యార్థులకు రూ.640, ఒకేషనల్ విద్యార్థులకు రూ.890, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రూ.890 పరీక్ష ఫీజుగా నిర్ణయించగా, కొన్ని ప్రైవేట్ కళాశాలలు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు.
విద్యాశాఖ, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఫీజుల వసూళ్లపై విచారణ చేపట్టాలని కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల వివరాలను ప్రతి విద్యాసంస్థ నోటీసు బోర్డులో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనంగా వసూలు చేసిన మొత్తాలను విద్యార్థులకు తిరిగి ఇప్పించడంతోపాటు,
నిబంధనలు ఉల్లంఘించిన విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేయకపోతే విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాడుతామని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.