కోయగూడెం ఓసి-3 సింగరేణి సంస్థే నిర్వహించాలి

16-11-2026 | 03:40pm

* ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఉద్యమం తప్పదు

* బోడు రోడ్ సెంటర్‌లో సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నాలుగు గంటల రాస్తారోకో

* సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా హెచ్చరిక

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం సింగరేణి కోయగూడెం(Singareni Koyagudem) ఓసి-3 బొగ్గు బ్లాక్‌ను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం టెండర్లు పిలుస్తోందని ఆరోపిస్తూ సిపిఐ, ఏఐటీయూసీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం టేకులపల్లి మండలం బోడు సెంటర్‌లో నాలుగు గంటలపాటు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా మాట్లాడుతూ.. సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని, కార్మికుల త్యాగాలతో నిర్మితమైన సంస్థను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని సహించేది లేదన్నారు.

ప్రైవేటీకరణతో శాశ్వత ఉద్యోగాలు, కార్మికుల హక్కులు, సంక్షేమ సౌకర్యాలకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. కోయగూడెం ఓసి-3ను సింగరేణి సంస్థే నిర్వహించాలని, టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెతో పాటు పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె.సారయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రేసు ఎల్లయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎండీ నజీర్ అహ్మద్, ఇల్లందు పట్టణ, మండల కార్యదర్శులు బాస శ్రీనివాస్, బొబ్బిశెట్టి సత్యనారాయణ, వజ్జా చిరంజీవి, టేకులపల్లి మండల కార్యదర్శి గుగులోత్ రాంచందర్, మాజీ మండల కార్యదర్శి ఉడుత ఐలయ్య, ఉపసర్పంచ్ కాసిం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు