దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయక పరికరాలు

16-11-2026 | 04:08pm

సైదాపూర్‌లో అలింకో వైద్య శిబిరం ప్రారంభించిన మంత్రి పొన్నం

హుజురాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): దివ్యాంగులు, వృద్ధులకు ఉచితంగా సహాయక పరికరాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో అలింకో సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన నిర్ధారణ వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు కృత్రిమ కాళ్లు, చేతులు, వినికిడి యంత్రాలు, వీల్‌చైర్లు, చంక కర్రలు తదితర ఉపకరణాలను ఉచితంగా అందజేస్తామని తెలిపారు.

అర్హులందరూ నిర్ణీత తేదీల్లో నిర్వహించే శిబిరాలకు హాజరై వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో ఐదు వేలకు పైగా కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని, అర్హత ఉండి పెన్షన్ రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పెన్షన్లు ఇప్పిస్తామని డబ్బులు అడిగే దళారులను నమ్మవద్దని హెచ్చరించారు. కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా ప్రతి దరఖాస్తును పరిశీలించి న్యాయం చేస్తామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 14 వేల మందికి స్క్రీనింగ్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి, అలింకో ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు