పేదల కళ్ళల్లో ఆనందం నింపిన ప్రజా ప్రభుత్వం
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభం
లబ్ధిదారులకు అందజేత
మహబూబాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): నిలువ నీడలేని పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు నిర్మించి ఇచ్చి పేదల కళ్ళల్లో ఆనందాన్ని ప్రజా ప్రభుత్వం నింపుతోందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్(Government Whip Dr Jathoth Ramachandru Naik), పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూరులో 280 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వారు సోమవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ తో కలిసి ప్రారంభించి, లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో గృహప్రవేశ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా నిలువ నీడలేని పేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఇచ్చిన హామీకి కట్టుబడి పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో సొంత ఇంటి కలను నిజం చేసే దిశగా కృషి చేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం హామీలతో పదేండ్ల కాలాన్ని వెళ్లదీసిందే తప్ప పేదల సంక్షేమానికి పాటుపడలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినప్పటికీ ఒక్కో సమస్యను అధిగమిస్తూ పేదల సంక్షేమం అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమా రజిని రాజశేఖర్, స్థానిక వార్డు కౌన్సిలర్ చపాల బాపు రెడ్డి, వార్డు కౌన్సిలర్లు పెద్దగాని కళావతి సోమన్న, ముద్దసాని సురేష్, భద్రు నాయక్, బసనబోయిన ఐలమ్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.