రుద్రంగిలో మొదటి ఫామ్ పాండ్ ప్రారంభం

16-11-2026 | 03:53pm

సొంత పొలంలో శ్రీకారం చుట్టిన సర్పంచ్ గండి నారాయణ

రుద్రంగి నవంబర్ 16 (విజయక్రాంతి): ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫామ్ పాండ్స్(Farm Ponds) నిర్మాణ పథకానికి రుద్రంగి మండల కేంద్రంలో శ్రీకారం చుట్టారు. గ్రామంలో మొట్టమొదటి స్టోరేజ్ గుంతను సోమవారం సర్పంచ్ గండి నారాయణ తన సొంత పొలం వద్ద ప్రారంభించారు.

పొలాల వద్ద ఉండే బోర్ల వద్ద వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు, భూగర్భ జలాలను పెంచుకునేందుకు ఈ ఫామ్ పాండ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు. వర్షం పడినప్పుడు వృథాగా పోయే నీటిని గుంతలో నిల్వ చేసుకుంటే, వేసవిలో కూడా బోర్లలో నీటి మట్టం తగ్గకుండా ఉంటుందని, పంటలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. తానే ముందుగా తన పొలంలో గుంత తవ్వించి రైతులకు ఆదర్శంగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకంలో రైతులు తమ భూమి విస్తీర్ణాన్ని బట్టి రెండు రకాల గుంతలు నిర్మించుకోవచ్చు.

1. 12 x 12 మీటర్ల గుంత,భూమి అవసరం : 2 గుంటలు (242 గజాలు),అంచనా వ్యయం : రూ.80 వేలు,పని దినాలు : 400,2. 20 x 20 మీటర్ల గుంత భూమి అవసరం 5 గుంటలు (605 గజాలు)అంచనా వ్యయం రూ. 4 లక్షలు,పని దినాలు : 11 వందల రోజులు, ఉపాధి హామీ పథకం ద్వారా ఈ గుంతల నిర్మాణానికి పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, అదే సమయంలో గ్రామంలోని కూలీలకు ఉపాధి కూడా లభిస్తుందని సర్పంచ్ వివరించారు.బోరు ఉన్న ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆసక్తి గల రైతులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీనివాస్ రెడ్డి, నాయకులు వార్డు సభ్యులు ద్యావల రవి, గ్రామస్తులు, రైతులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు