మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

17-11-2026 | 09:30pm

దమ్మపేట, నవంబర్ 17(విజయ క్రాంతి): మండల పరిధిలోని మందలపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో(Telangana Social Welfare Gurukul School) మండల న్యాయ సేవా అధికార కమిటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్–1985 చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల న్యాయ సేవా అధికార కమిటీ చైర్మన్, న్యాయమూర్తి డా. బొమ్మతి భవాని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యతని, ముఖ్యంగా విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, శారీరక, మానసిక ఆరోగ్యంపై వాటి ప్రభావం, కుటుంబాలు, సమాజంపై పడే దుష్పరిణామాలను వివరించారు.

అలాగే ఎన్ డి పి ఎస్ యాక్ట్–1985 గురించి వివరిస్తూ మాదకద్రవ్యాల అక్రమ నిల్వ, రవాణా, విక్రయం, వినియోగం వంటి నేరాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలు, నేర స్వభావం  మాదకద్రవ్యాల పరిమాణాన్ని బట్టి విధించే జరిమానాలు, కఠిన కారాగార శిక్షల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.

విద్యార్థులు చెడు స్నేహాలకు, తప్పుడు ప్రలోభాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా మాదకద్రవ్యాల వినియోగానికి ప్రోత్సహించినా వాటికి లొంగకూడదని సూచించారు. డ్రగ్స్ విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. 

విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకుని, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఈ సందర్భంగా మండల న్యాయ సేవా అధికార కమిటీ చైర్మన్ డా. బొమ్మతి భవాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొంది మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి లక్కినేని నరేంద్ర బాబు, న్యాయవాదులు గోళ్ల భవాని కృష్ణ యాదవ్, నల్లపు ఉదయ్, తామా బలరాజు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు