విద్యా, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట
- సామాజిక భద్రతతో పాటు మహిళా సాధికారత, ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత
- ప్రజలకు సేవ చేయడమే తన రాజకీయ ప్రస్థానంలో ప్రధాన లక్ష్యం
- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
మునిపల్లి నవంబర్ 17( విజయక్రాంతి )ః అర్హులైన వారందరికి సంక్షేమ ఫలాలు అందించడంతోపాటు విద్యా, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister for Welfare, Damodar Raja Narasimha)అన్నారు.
మంగళవారం అందోల్ నియోజకవర్గ పరిధిలోని మునిపల్లి మండల కేంద్రంలో ఎస్‌ఆర్‌ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన చేయూత నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునిపల్లి, రాయికోడ్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రజల ఆరోగ్యం, నాణ్యమైన విద్య, కుటుంబాల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు.
అనారోగ్యంతో కుటుంబాలు అప్పులపాలు కాకుండా మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని, ప్రతి గ్రామంలో వైద్య సదుపాయాలను బలోపేతం చేయాలని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు తదితర అర్హులైన వర్గాలకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందన్నారు.
చేయూత పింఛన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, పేదలకు ఆత్మవిశ్వాసం, భరోసా కల్పించే సామాజిక భద్రత అని పేర్కొన్నారు. వృద్దుల కన్న వితంతులు, ఒంటరి మహిళలు ఎక్కువగా అవుతున్నారని, వృద్దుల సంఖ్య పెరగాలి తప్ప.. మిగతా వాళ్లు పెరగడం వల్ల కుటుంబాలు ఇబ్బందులకు గురవతున్నారన్నారు.
రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందోల్ నియోజకవర్గంలో రోడ్లు, పాఠశాలల భవనాలు, వసతులు, వెనుకబడినప్రాంతాలు అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమవుతుందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని వివిధ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిఆరు.
ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సమీపంలో గల మునిపల్లి మండలంలోని మక్తక్యాసారం, చీలపల్లి, కల్లపల్లి బేలూర్, రాయికోడ్ మండలం హస్నాబాద్, ఇందూర్ తదితర గ్రామాలకు కనెక్టివిటి రోడ్లు లేక రవాణా సౌకర్యాలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రజలకు ఆ దుస్థితి రావొద్దనే ఉద్దేశంతో రూ.100కోట్లతో బుదేరా చౌరస్తా నుంచి
అల్లాపూర్ , లోనికాలాన్, తక్కడపల్లి - గార్లపల్లి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు రాయికోడ్ మండలం హస్నాబాద్, మామిడిపల్లి, ఇందూర్, సిరూర్ వరకు నిర్మిస్తున్న రోడ్డు పూర్తిఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందన్నారు. సింగూరు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రిసోర్ట్స్ ఏర్పాటైతే ఈ ప్రాంతం అభివృద్దితోపాటు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.
గతంలో దివంగత వైస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ( 2004- 2005) సింగూరు ప్రాజెక్టు కింద వంతెన నిర్మాణం, మునిపల్లి నుంచి చందాపూర్ గ్రామ సరిహద్దు వరకు బీటీ రోడ్డు చేపట్టి రవాణా సౌకర్యానికి ఇబ్బందులు లేకుండా చేసినట్లు గుర్తు చేశారు. నేను ఎట్లబతకాలి అన్నది ముఖ్యం కాదు..
మేము ఎట్ల బతకాలి అన్నదే ముఖ్యమని, అందుకు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం చేయూతనందిస్తుందని వివరించారు. మహిళా సాధికారిత కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తూ.. సకాలంలో రుణాలు చెల్లిస్తే వడ్డీ సర్కారే భరిస్తుందని, మహిళలు పెట్రోల్బంకులు, ఇందిరమ్మ క్యాంటిన్‌లు ఏర్పాటు చేసుకునేందుకు ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు.
అలాగే చౌటకూర్ మండలం శివంపేటలో మహిళలే ఒక పెట్రోల్ బంకును నిర్మించబోతున్నట్లు వివరించారు. ఈ ప్రాంతం ముంబాయి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నందను ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆసుపత్రి క్యాంటిన్ లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తుచేసుకోవచ్చని తెలిపారు.
ముఖ్యంగా కంకోల్ లో ఎమర్జెన్సీ సెంటర్ కాబోతుందని, మునిపల్లిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను రూ.8కోట్లతో రాబోతుందన్నారు. ఆనాడు 2011 - 12 మహిళా డిగ్రీ కళాశాలను బుదేరా నిర్మించింది తన హయాంలోనేనని గుర్తు చేశారు. కళాశాల మరింత అభివృద్ది కోసం రూ.8కోట్ల వెచ్చించి కళాశాలలో వివిధ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
అదే విధంగా గతేడాది లింగంపల్లి గురుకుల పాఠశాల శిథిలావస్థలకు చేరి కూలిందని, నూతన భవన నిర్మాణాల కోసం రూ.10కోట్ల సీఎస్ఆర్ నిధులు, రూ.8కోట్ల సర్కారు నిధులు మంజూరుచేసి నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. అరంతకం
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారునికి చేరేలా చూడటమే అధికారుల లక్ష్యమన్నారు. పింఛన్ అనేది కేవలం డబ్బు మాత్రమే కాదని, దానితో లబ్ధిదారులకు ఆత్మవిశ్వాసం, భద్రత కలుగుతాయని పేర్కొన్నారు. మునిపల్లి మండలంలో 629 మందికి, రాయికోడ్ మండలంలో 584 మందికి కలిపి మొత్తం 1,213 మందికి నూతనంగా చేయూత పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 18,591 నూతన పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని లబ్ధిదారులకు సూచించారు. . ఈ నెల 19వ తేదీ నుంచి పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు. 18 నుంచి 59 ఏళ్ల వయసు కలిగిన అర్హులకు ఈ పథకం వర్తిస్తుందని, ప్రతి కుటుంబంలో ఒకరికి రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు.
దరఖాస్తుదారులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను అందజేయాలని సూచించారు. గ్రామ పంచాయతీలు, ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపల్ వార్డుల పరిధిలో దరఖాస్తుల స్వీకరణతో పాటు ఆన్‌లైన్‌లో వివరాల నమోదు ప్రక్రియ చేపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జగదీశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి,
అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సూర్యారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, ఆయా మండలాల అధ్యక్షులు సతీష్, ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, గ్రామ సర్పంచులు, మహిళా సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, నూతన పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.