సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి

17-11-2026 | 09:13pm

మేనిఫెస్టో డే సందర్భంగా గజ్వేల్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయుల ధర్మదీక్ష

గజ్వేల్, నవంబర్ 17: గజ్వేల్‌లో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని(Old Pension System) (ఓపీఎస్) తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయులు మంగళవారం కదంతొక్కారు. మేనిఫెస్టో డే సందర్భంగా టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర శాఖ(TSCPSEU State Branch) పిలుపు మేరకు గజ్వేల్ డివిజన్ కేంద్రంలో ధర్మదీక్ష నిర్వహించారు.

వివిధ ప్రభుత్వ శాఖలు, పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు సామూహిక సెలవు పెట్టి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లికార్జున్, జిల్లా కోశాధికారి ఏల్మ రాజు, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు నరేందర్, ప్రవీణ్ చారి, నరేష్ చారి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా హామీని అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు జి. స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ నేతృత్వంలో జనజాగరణ యాత్ర నిర్వహించి ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసి సమస్యను వివరించినట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 2.80 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని, పదవీ విరమణ తర్వాత అతి తక్కువ పెన్షన్‌తో ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల తరహాలో తెలంగాణలోనూ ఓపీఎస్ అమలు చేసి ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలని కోరారు.

సీపీఎస్ రద్దు, ఉద్యోగుల ఆరోగ్య పథకం కమిటీల్లో యూనియన్ ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించాలని, పెండింగ్ డీఏ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నరసింహ, విద్యాసాగర్, మోహినుద్దీన్, సురేష్, ప్రవీణ్, భరత్, నాగభూషణం, వికాస్ రెడ్డి, సంతోష్, నాగరాజు, వెంకటేశ్వర్లు, వెంకట్, చంద్రశేఖర్, నరేష్, మురళి, అనిల్, దామోదర్, శ్రీశైలం, జ్యోతి, రజిత, శ్వేత, సంతోషి కుమారి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు