ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండ
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి.. పప్పుల అంజిరెడ్డి
మేడిపల్లి, నవంబర్ 17 (విజయక్రాంతి): మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ పీర్జాదిగూడ డివిజన్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులు మంజూరయ్యాయి.
మంగళవారం డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ సహకారంతో మంజూరైన చెక్కులను సీనియర్ నాయకులు పప్పుల అంజిరెడ్డి లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసా కల్పిస్తోందని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందడంతో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ, తమకు అండగా నిలిచిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.