ఆలయ స్థలంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌

17-11-2026 | 09:10pm
  1. తునికి బొల్లారం ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉద్రిక్తత
  2. హనుమాన్ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకున్నారని గ్రామస్తుల ఆగ్రహం
  3. 50 మంది పోలీసులతో వచ్చిన తహసీల్దార్‌
  4. విగ్రహం తొలగింపు యత్నాన్ని అడ్డుకున్న గ్రామస్తులు

గజ్వేల్, నవంబర్ 17: కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు(Kondapochamma Sagar Project) ముంపు గ్రామాలైన బహలింపూర్, తనేదర్పల్లి, తనేదర్పల్లి తండాల్లో ఆలయ స్థలాల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గత ప్రభుత్వం ఆలయాల నిర్మాణానికి కేటాయించిన స్థలంలో తనేదర్పల్లి, తండా గ్రామస్తులు ప్రభుత్వ నిధులతో హనుమాన్ ఆలయాన్ని బేస్‌మెంట్ వరకు నిర్మించారు.

ప్రభుత్వం మారడంతో నిధులు నిలిచిపోవడంతో నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. కాగా, ఆలయానికి కేటాయించిన స్థలంలో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తహసీల్దార్ రవీందర్ రెడ్డితో కలిసి ఐదు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో గ్రామస్తులు హనుమాన్ ఆలయ నిర్మాణానికి సిద్ధమవగా, తహసీల్దార్ రవీందర్ రెడ్డి 50 మంది పోలీసులతో అక్కడికి చేరుకుని విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించారని గ్రామస్తులు ఆరోపించారు.

గ్రామస్తులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఆలయాల కోసం కేటాయించిన స్థలాలను పరిరక్షించాలని, హనుమాన్ ఆలయ నిర్మాణానికి ఆటంకాలు కలిగించవద్దని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆలయ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు