రిమోట్ సెన్సింగ్‌తో ఎల్‌నినో వంటి వాతావరణ సమస్యల అధ్యయనం

17-11-2026 | 09:19pm

ములుగు అటవీ కళాశాలలో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభం

గజ్వేల్ నవంబర్ 17: సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల(Forestry College) మరియు పరిశోధన సంస్థలో రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ సాంకేతిక పరిజ్ఞానంపై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎన్. శ్రీనిధి మాట్లాడుతూ ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఎల్‌నినో వంటి వాతావరణ సమస్యలను అధ్యయనం చేయడంలో రిమోట్ సెన్సింగ్,

జీఐఎస్ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అటవీ వనరుల అంచనా, పర్యావరణ పర్యవేక్షణ, సహజ వనరుల సుస్థిర నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రంగంలో నిపుణుల కొరత స్పష్టంగా ఉందని, దానిని అధిగమించే లక్ష్యంతో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువత ఈ శిక్షణలో పాల్గొంటున్నారని తెలిపారు. శిక్షణలో ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ, అటవీ విస్తీర్ణం అంచనా, అటవీ అగ్ని ప్రమాదాల పర్యవేక్షణ, భూ వినియోగ మార్పులు, పర్యావరణ విశ్లేషణ వంటి అంశాలపై ప్రాక్టికల్ అవగాహన కల్పించనున్నారు.

అటవీ కళాశాల డీన్ బి.ప్రవీణ చైర్‌పర్సన్‌గా, కళాశాల డిప్యూటీ డైరెక్టర్ ఎన్.కవిత కో-చైర్‌పర్సన్‌గా, కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ఫారెస్ట్, ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ సైన్సెస్ విభాగాధిపతి డా.ఎన్. శ్రీనిధి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న.

ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం  డీన్ డా.జె.చీనా, ప్యూర్ ఎర్త్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు, సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ ప్రాంతీయ డైరెక్టర్ డా.కె.జయచంద్ర  హాజరయ్యారు. ఐఈఈఈ హైదరాబాద్ చాప్టర్ – జియోసైన్స్ అండ్ రిమోట్ సెన్సింగ్ సొసైటీ, ప్యూర్ ఎర్త్ ఫౌండేషన్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న.

ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో రిమోట్ సెన్సింగ్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (GIS) ప్రాథమిక అంశాలతో పాటు అటవీ, పర్యావరణ నిర్వహణలో వాటి వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. జియో స్పేషియల్ డేటా సేకరణ, ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ, ప్రాదేశిక విశ్లేషణ, థీమాటిక్ మ్యాపింగ్, జీఐఎస్ ఆధారిత పర్యావరణ పర్యవేక్షణ వంటి అంశాలపై సాంకేతిక తరగతులు నిర్వహించనున్నారు.

అటవీ విస్తీర్ణం అంచనా, భూమి వినియోగం–భూ ఆవరణ మ్యాపింగ్, అటవీ అగ్ని ప్రమాదాల పర్యవేక్షణ, చిత్తడి నేలల అంచనా, భూ భాగ విశ్లేషణ, ఖచ్చితత్వ అంచనా, మాక్సింట్ సాఫ్ట్‌వేర్ ద్వారా జీవావరణ అనుకూలత నమూనాల రూపకల్పన వంటి అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ అందించనున్నారు. సాఫ్ట్‌వేర్ ప్రదర్శనలు, ప్రత్యక్ష అభ్యాస కార్యక్రమాల ద్వారా పాల్గొనేవారికి జియోస్పేషియల్ డేటా ప్రాసెసింగ్, విశ్లేషణలో అనుభవాన్ని కల్పించనున్నారు.

మరిన్ని వార్తలు