జింక మాంసం అక్రమ రవాణా.. వ్యక్తి అరెస్ట్
9 కేజీల జింక మాంసం స్వాధీనం
దమ్మపేట, నవంబర్ 15 (విజయక్రాంతి): మండల పరిధిలోని అప్పారావుపేట గ్రామ(Apparaopeta village) సమీపంలో నవంబర్ 13వ తేదీ రాత్రి సుమారు 7.00 గంటల సమయంలో అటవీ శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి యాక్టివా ద్విచక్ర వాహనంపై సుమారు 9 కిలోల చుక్కల జింక మాంసాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుబడ్డాడు.
ఈ సందర్భంగా దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి కె శ్రీను తెలిపిన వివరాల ప్రకారం దమ్మపేట అటవీ శాఖ పరిధిలో వన్యప్రాణుల వేట, మాంసం అక్రమ రవాణా, విక్రయాలపై అటవీ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తుండగా అప్పారావుపేట గ్రామ సమీపంలో ఒక వ్యక్తి యాక్టివా ద్విచక్ర వాహనంపై సుమారు 9 కిలోల చుక్కల జింక మాంసాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా నిందితుడి వద్ద నుండి సుమారు 9 కిలోల జింక మాంసాన్ని, సంబంధిత వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సదరు వ్యక్తిని విచారించగా, సాయి అనే వ్యక్తి తనకు వన్యప్రాణి మాంసాన్ని విక్రయించడానికి ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడించినట్లు తెలిపారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం కేసు నమోదు చేసి, మాంసం సరఫరా చేసిన వ్యక్తితో పాటు ఇతర సంబంధిత వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, కొత్తగూడెం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 15 రోజుల రిమాండ్ విధించగా సత్తుపల్లి సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972లోని షెడ్యూల్-II కింద రక్షణ పొందుతున్న వన్యప్రాణి జాతి, వీటిని వేటాడటం, చంపడం, వాటి మాంసాన్ని అక్రమంగా కలిగి ఉండటం, రవాణా చేయడం లేదా విక్రయించడం చట్టప్రకారం శిక్షార్హమైన నేరమని, అటువంటి నేరాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని రేంజర్ కె శ్రీను తెలిపారు. ఈ తనిఖీలలో దమ్మపేట డిప్యూటీ రేంజ్ అధికారి జయరాం, ఫారెస్ట్ బీట్ అధికారి రామారావు, బేస్ క్యాంపు సిబ్బంది నాయుడు, వెంకటేష్, వంశీ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.