అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నా అందని దివ్యాంగుల పెన్షన్!

11-11-2026 | 10:31pm
  1. - ఆన్‌లైన్‌లో ట్రాక్టర్ ఉన్నట్లు చూపిస్తూ పెన్షన్ నిలిపివేత?
  2. - 23 ఏళ్ల దివ్యాంగురాలికి తప్పని ఎదురుచూపులు
  3. - అధికారుల నిర్లక్ష్యంతో అర్హత ఉన్నా అందని ప్రభుత్వ సాయం
  4. - స్పందించి న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకోలు

మణుగూరు, నవంబర్ 11 (విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలకు అందించాల్సి ఉండగా, అర్హత ఉన్నప్పటికీ ఓ దివ్యాంగురాలికి పెన్షన్ అందకపోవడం ఆవేదన కలిగిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన కారం నాగేశ్వరరావు కుమార్తె కారం రేవతి (23) మానసిక, శారీరక వైకల్యంతో బాధపడుతోంది.ఒకవైపు దివ్యాంగురాలి వైద్య అవసరాలు, మరోవైపు కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు.

క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించకుండా ఆన్‌లైన్ రికార్డుల ఆధారంగా అర్హులకు సంక్షేమ పథకాలు అందకుండా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ట్రాక్టర్ వివరాలపై క్షేత్రస్థాయి విచారణ చేపట్టి, అర్హురాలైన కారం రేవతికి దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నారు.

మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం

ట్రాక్టర్ తో సాకుతో మున్సిపాలిటీ అధికారులు టాక్టర్ ఉందంటూ, పెన్షన్ నిలిపివేస్తామంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గతంలో ఎప్పుడో తీసుకున్న ట్రాక్టర్ తండ్రి పేరు మీద ఉండడం దివ్యాంగురాలు అయిన కారం రేవతికి శాపం గా మారింది. కనీసం అధికారులు ట్రాక్టర్ లేదు తెలిపిన కూడా ఆన్లైన్లో పేరు చూపెడుతుందని కుంటి సాకులతో కాలయాపన చేస్తున్నారు. దివ్యాంగురాలుగా కారం రేవతి పుట్టడం నేరమా అంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తుంది. జిల్లా కలెక్టర్ స్పందించి దివ్యాంగురాలు కారం రేవతికి పెన్షన్ వచ్చేలాగా న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, పలువురు సైతం వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు