భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలి

11-11-2026 | 11:14pm

నవంబర్ 30లోగా తొలి విడతలో ఎంపిక చేసిన గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయాలి

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మహబూబాబాద్ (విజయక్రాంతి): భూముల రీసర్వే ప్రక్రియను రైతులకు ప్రయోజనం కలిగేలా పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అధికారులను ఆదేశించారు.

బుధవారం హైదరాబాద్ నుంచి సీసీఎల్ఏ లోకేష్ కుమార్, గృహ నిర్మాణ శాఖ ఎండీ వీ . పీ గౌతమ్‌లతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, రెవెన్యూ శాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భూముల రీసర్వే ప్రక్రియ, భూ సమస్యల పరిష్కారం, పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ, పెండింగ్ దరఖాస్తులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా ప్రతి జిల్లాలో తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను నవంబర్ 30వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రీసర్వే పనులను అధికారులు అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, ఏ.డి సర్వే ల్యాండ్ అధికారి శ్రీనివాస్, తొర్రూరు ఆర్.డి.ఓ గణేష్,   సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు