అత్యాధునిక మౌలిక వసతులతో లేఅవుట్ల అభివృద్ధి
కీసర ఆర్డీవో నల్ల వెంకటరెడ్డి
ఘట్ కేసర్, నవంబర్ 11 (విజయక్రాంతి): ల్యాండ్ పూలింగ్ పథకం ద్వారా సేకరించిన భూములను అత్యాధునిక మౌలిక వసతులతో అభివృద్ధి చేయనున్నట్లు కీసర ఆర్డీవో నల్ల వెంకటరెడ్డి(RDO Nalla Venkat Reddy) అన్నారు. పోచారం డివిజన్ పరిధిలోని ప్రతాపసింగారం రైతువేదికలో ప్రతాపసింగారం, ముత్వెల్లిగూడ, కాచవానిసింగారం గ్రామాల రైతులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డితో కలసి పాల్గొని పథకం వివరాలను వెల్లడించారు.
మూసి రివర్ ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపడుతున్న మూసి అభివృద్ధికి రూ. 6,600 కోట్లు కేటాయించినట్లు, దీనితో ఇక్కడి అభివృద్ధి అంచనా వేసుకోవాలని తెలిపారు. ఘట్ కేసర్ రెవెన్యూ మండల పరిధిలో ల్యాండ్ పూలింగ్ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. బహుళ ప్రయోజనాలకు అనువైన ప్లాట్లతో లేఅవుట్లు రూపొందిస్తామని పేర్కొన్నారు.
పట్టా భూములకు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో ఎకరాకు 400 గజాలు, బఫర్ జోన్లో 800 గజాలు, మిగిలిన భూమికి 1,400 గజాలు లేదా అభివృద్ధి అనంతరం 50:50 నిష్పత్తిలో ఏది తక్కువైతే ఆమేరకు ప్లాట్లు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ ఆక్రమణ భూములకు ఎకరాకు 300 గజాలు కేటాయించనున్నట్లు వివరించారు. గురువారం నుంచి 500 మీటర్ల పరిధిలో హద్దుల గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు.
రైతుల అసంతృప్తి వాటా పెంచాలని డిమాండ్
ప్రభుత్వ ప్రతిపాదనలపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ తేడా లేకుండా అందరికీ సమాన ప్రాతిపదికన ప్లాట్లు కేటాయించాలని, పట్టాదారులకు వాటా పెంచాలని డిమాండ్ చేశారు. లేఅవుట్ల అభివృద్ధికి నిర్దిష్ట గడువు ప్రకటించడంతో పాటు నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయకపోతే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో ఘట్ కేసర్ తహసీల్దార్ చంద్రశేఖర్, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, ఆర్ఐ లు సాయిరాం, కావ్య, రెవెన్యూ అధికారులు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.