గిరిజన తండాలకు రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యం

11-11-2026 | 11:11pm

రుద్రంగి అభివృద్ధి పనులకు రూ.7.07 కోట్లతో శంకుస్థాపన 

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రుద్రంగి నవంబర్ 11(విజయక్రాంతి): వేములవాడ నియోజకవర్గంలోని గిరిజన తండాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Lakshman Kumar) అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా మొత్తం రూ.7.07 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.రుద్రంగి మెయిన్ రోడ్డు నుంచి కుక్కలగండి తండా వరకు రూ.4.57 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులకు, మరో రూ.2.50 oకోట్లతో బీటీ రోడ్డు, హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం గిరిజన శాఖ ద్వారా సుమారు రూ.740 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. వేములవాడ నియోజకవర్గంలోని గిరిజన తండాలకు రహదారి కనెక్టివిటీ కల్పించేందుకు సుమారు రూ.100 కోట్ల నిధులు కేటాయించే దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా తొలివిడతలో సుమారు రూ.40 కోట్లతో వివిధ గ్రామాలు, గిరిజన తండాల్లో రోడ్ల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఆయన సూచనల మేరకు గిరిజన తండాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు నిధులు కేటాయిస్తూ పనులు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు