భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలి
రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి
భూపాలపల్లి టౌన్, నవంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి బుధవారం హైదరాబాద్ రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో భూముల రీసర్వే ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ భూముల రీసర్వే ప్రక్రియపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించామని, ఉమ్మడి జిల్లాలలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు రెవెన్యూ అంశాలపై సమీక్షలు నిర్వహించామని తెలిపారు. నవంబర్ నెలాఖరులోగా ప్రతి జిల్లాలో తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాలతో పాటు నక్షా లేని గ్రామాల్లో రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు.
మండలాల వారీగా సర్వే బృందాల ఏర్పాటు..
ప్రతి మండలంలో రీసర్వే కోసం అవసరమైన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. రీసర్వే పనులను వేగవంతం చేసేందుకు సర్వే బృందాల సంఖ్యను పెంచాలని తెలిపారు.
రీసర్వేలో పారదర్శకత, నాణ్యత తప్పనిసరి..
రీసర్వే జరిగే సమయంలో సంబంధిత గ్రామాల రైతులకు ముందుగానే సమాచారం అందించాలని, స్థానిక రైతుల సమక్షంలోనే సర్వే ప్రక్రియ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రైతులకు ముందస్తుగా నోటీసులు జారీ చేయడంతో పాటు అవసరమైన కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలిపారు. సర్వే నివేదికలపై అభ్యంతరాలు ఎలా సమర్పించాలి, ఎక్కడ సమర్పించాలి, ఏ విధంగా పరిష్కరించబడతాయి అనే అంశాలపై ప్రజలకు ముందుగానే అవగాహన కల్పించాలని ఆదేశించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వే వివరాలను ప్రజలకు తెలియజేస్తూ దండోరా వేయించాలని, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు అవకాశం కల్పించాలని తెలిపారు.
అసైన్డ్ భూముల పట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి..
అసైన్డ్ భూములకు సంబంధించి పట్టాలు అసలైనవా, నకిలీవా అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని మంత్రి సూచించారు. పట్టా పొందిన వ్యక్తులే ప్రస్తుతం ఆ భూములపై ఆధీనంలో ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించాలని తెలిపారు. గతంలో ఒకరికి పట్టా ఇచ్చినప్పటికి ప్రస్తుతం మరొకరు భూమిని అనుభవిస్తున్నట్లయితే, ప్రస్తుత అనుభవదారుడు అర్హుడా కాదా అనే అంశాన్ని నిబంధనల ప్రకారం పరిశీలించాలని ఆదేశించారు.
పట్టాలో పేర్కొన్న విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమి విస్తీర్ణానికి మధ్య తేడాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా క్షేత్రస్థాయిలో సరిచూసుకోవాలని తెలిపారు. రీసర్వేలో ఏ అధికారి అయినా అక్రమాలకు, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు.
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దాదాపు 2 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ఇప్పటికే 4, 5 నెలలు దాటిందని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. మొదటి విడత నుంచి సుమారు 60 వేల ఇళ్లు స్పిల్ ఓవర్ అయ్యాయని, మొత్తంగా 2.60 లక్షల ఇళ్లలో ఇప్పటివరకు 40,000 నుండి 50,000 వరకు మాత్రమే ఫైనలైజ్ అయ్యాయని మంత్రి అన్నారు. లబ్ధిదారుల జాబితాను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి, పనులను వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 83 గ్రామాల్లో రీ సర్వే చేపట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు 30 గ్రామాల్లో మాత్రమే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.
మిగిలిన గ్రామాల్లోనూ వెంటనే సర్వే పనులు ప్రారంభించేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. నవంబర్ 16వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని మండలాల పరిధిలోని గ్రామాల్లో రీ సర్వే ప్రారంభమయ్యేలా తహశీల్దార్లు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, ఆర్డీఒ హరికృష్ణ, అన్ని మండలాల తహశీల్దార్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.