అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలప దిమ్మలు స్వాధీనం
భద్రాచలంలో అటవీశాఖ అధికారుల దాడులు
లక్ష రూపాయల విలువైన కలప పట్టివేత
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలప దిమ్మలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు భద్రాచలం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జస్వంత్(Forest Range Officer Jaswant) తన సిబ్బందితో కలిసి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదురువీధిలో ఉన్న ఓ అద్దె ఇంటిపై మంగళవారం దాడులు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో సుమారు లక్ష రూపాయల విలువ చేసే టేకు కలప దిమ్మలు గుర్తించారు. దీంతో అటవీశాఖ అధికారులు నిబంధనల ప్రకారం కలపను స్వాధీనం చేసుకుని, సీజ్ చేసి ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, కలప నిల్వకు సంబంధించిన వివరాలపై విచారణ చేపట్టారు.
సదరు అద్దె ఇంట్లో మహిళ ఉంటున్నట్లు, ఆమె ఇంట్లోనే టేకు కలప దిమ్మలు లభించినట్లు అధికారులు తెలిపారు. కలపకు సంబంధించి అటవీశాఖ అధికారులు ప్రశ్నించగా, ఆ కలప తనదేనని, దీనికి తానే బాధ్యురాలినని ఆమె అంగీకరించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అటవీ సంపదను అక్రమంగా తరలించడం, నిల్వ చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.