అక్రమంగా పశువులను తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు
నాలుగు ఎద్దులు, వాహనం స్వాధీనం
వెంకటాపురం నూగూరు నవంబర్ 3 (విజయక్రాంతి): వెంకటాపురం మండల పోలీస్ స్టేషన్(Venkatapuram Mandal Police Station) పరిధిలో పశువులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై, పోలీసులు కేసు నమోదు చేసి, నాలుగు ఎద్దులతో పాటు ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది మండలం, పాతాపురం గ్రామంలోని రైతు వేదిక సమీపంలో, స్టేట్ హైవే-12పై ఎస్ఐ కే. తిరుపతి రావు తన సిబ్బందితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా వెళ్తున్న మహీంద్రా బొలెరో గూడ్స్ క్యారేజ్ వాహనం (నంబర్: TS04UA5033)ను ఆపి తనిఖీ చేశారు.
తనిఖీలో వాహనంలో నాలుగు ఎద్దులను ఎలాంటి తగిన జాగ్రత్తలు, రక్షణ చర్యలు లేకుండా, ఇరుకుగా, ఒకదానిపై మరొకటి పడే విధంగా కుక్కి, తాళ్లతో గట్టిగా కట్టి తరలిస్తున్నట్లు గుర్తించారు. వాటికి తగిన మేత, నీరు అందించకుండా క్రూరంగా వ్యవహరిస్తూ, విక్రయించేందుకు పశువుల మార్కెట్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ ఎద్దులను చర్ల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద సుమారు రూ.52,000 విలువకు కొనుగోలు చేసి, వెంకటాపురం వైపు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి వాహన డ్రైవర్ థోకల నవీన్ (32), సహాయకుడు కోగిల శ్రీరామ్ మూర్తి (34)లను అదుపులోకి తీసుకుని, పంచ సాక్షుల సమక్షంలో నాలుగు ఎద్దులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సంబంధిత వాహన యజమాని, నిందితుడు A3 మహమ్మద్ జహీర్‌ను అరెస్టు చేయాల్సి ఉంది. పశువుల అక్రమ రవాణా, వాటి పట్ల క్రూరత్వానికి పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.