హనుమాన్ ఆలయంలో 'కార్తీక' ఏర్పాట్లు

03-11-2026 | 11:17pm

- కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో కార్తీకమాసం ఏర్పాట్లపై సమీక్ష 

ఎల్బీనగర్, నవంబర్ ‌3: ప్రసిద్ధ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో కార్తీక మాసం పూజలు భక్తిశ్రద్ధలతో కొనసాగనున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలి రానున్నారు. కార్తీక మాసం పూజా ఏర్పాట్లపై మంగళవారం ఆలయ అర్చకులు, సిబ్బందితో కార్యనిర్వహణాధికారి ఎన్.లావణ్య(Executive Officer N. Lavanya) సమీక్ష నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా హనుమాన్ ఆలయంలో రుద్రాభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, రుద్ర హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కార్తీక పౌర్ణమి రోజున స్వామివారి పుష్కరిణి పూజ, ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక సింధూరాభిషేకాలు,  దర్శనాలకు ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాట్లు, డిప్యుటేషన్ పై అదనపు సిబ్బంది ఏర్పాటు, ప్రసాదాలు, ప్రోటోకాల్ ను అనుసరించి ప్రముఖులకు ఆహ్వానాలు ఇతర విషయాలపై అర్చక, సిబ్బందికి ఈవో లావణ్య పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విధులు నిర్వహించాలని ఈవో ఆదేశించారు.

మరిన్ని వార్తలు