ఇంచార్జి మత్స్యశాఖ అధికారిపై సస్పెన్షన్ వేటు..
గతంలో ఖమ్మం జిల్లాలో జరిగిన తప్పిదాలే కారణం?
సూర్యాపేట, నవంబర్ 3 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ మత్స్యశాఖ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డి. అంజనేయస్వామి(Fisheries Officer Anjaneyaswamy)పై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో ఖమ్మం జిల్లాలో మత్స్యశాఖ అధికారిగా విధులు నిర్వహించిన సమయంలో మత్స్యకార సహకార సంఘాల సభ్యత్వాల నమోదు, పాత సభ్యత్వాల పునరుద్ధరణ ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మత్స్యశాఖ సంచాలకురాలు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఖమ్మం జిల్లాలో అక్రమాల ఆరోపణలు:
2024లో అంజనేయస్వామి ఖమ్మం జిల్లా మత్స్యశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో జిల్లాలోని ఓ మత్స్యకార సహకార సంఘంలో కొత్త సభ్యత్వాల నమోదు, పాత సభ్యత్వాల పునరుద్ధరణ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సుమారు 89 మంది పేర్లను సంఘం సభ్యుల జాబితాలో చేర్చినట్లు తెలిసింది. అయితే సభ్యత్వాల నమోదు, పునరుద్ధరణకు సంబంధించి అనుసరించాల్సిన నిబంధనలు, అధికారిక ప్రక్రియలను పూర్తిస్థాయిలో పాటించలేదన్న కారణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.
చర్చనీయాంశంగా సస్పెన్షన్ వ్యవహారం:
జూన్ 24, 2026న జిల్లా ఇంచార్జి మత్స్యశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అధికారి, గతంలో ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహించిన సమయంలో చోటుచేసుకున్న వ్యవహారంతో సస్పెన్షన్ కు గురికావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించే అధికారులు నిబంధనలకు అనుగుణంగా బాధ్యతయుతంగా వ్యవహరించాలని ఈ ఘటన ద్వారా తెలుస్తుంది.
బదిలీ అయినా వెంటాడిన పాత వ్యవహారం..
ఖమ్మం జిల్లాలో ఈ వ్యవహారం కొనసాగుతున్న సమయంలోనే అంజనేయస్వామి నిజామాబాద్ కు సహాయ సంచాలకుడిగా బదిలీపై వెళ్లారు. అనంతరం 2026 జూన్ 24న సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ మత్స్యశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలలకే గతంలో ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న సభ్యత్వాల వ్యవహారం మళ్లీ తెరపైకి రావడం, చివరకు ఆయనపై సస్పెన్షన్ వేటు పడటం మత్స్యశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.