నిబద్ధత గల సీనియర్ నాయకుడి కోల్పోవడం బాధాకరం
- ప్రజా, కార్మిక ఉద్యమాల్లోనాగేశ్వరరావు సేవలు మరువలేనివి
- చప్పడి కుటుంబానికి అండగా పార్టీ నిలుస్తుంది
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెం టౌన్ నవంబర్ 3 (విజయకాంతి): ప్రజా ఉద్యమాల్లో, కార్మిక వర్గ హక్కుల పరిరక్షణలో సీనియర్ నాయకులు చేసిన సేవలు ఎనలేనివని, వారి కృషి ఎప్పటికీ మరువలేనిదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. రామవరం పంజాబ్ గడ్డ ప్రాంతానికి చెందిన సిపిఐ, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు చప్పిడి నాగేశ్వరరావు ఇటీవల మృతిచెందగా, మంగళవారం వారి నివాసానికి కూనంనేని సాంబశివరావు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక సమస్యలపై రాజీలేని పోరాటాలు సాగించిన నిబద్ధత గల ప్రజా నాయకుడిని కోల్పోవడం పార్టీకి, కార్మిక వర్గానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితాంతం ప్రజా సమస్యల పరిష్కారానికే అంకితమైన ఆయన చూపిన బాటలో నడవడమే వారికిచ్చే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య, పట్టణ నాయకులు గుత్తుల శ్రీనివాస్, మృతుడి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.