నాటుసారా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు
మణుగూరు /కరకగూడెం, నవంబర్ 11 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) కరకగూడెం మండలం కలవలనాగారం గ్రామంలో మణుగూరు ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామ సమీపంలోని వాగు ఒడ్డున అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల పులియబెట్టిన బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. నాటుసారా తయారీకి ఉపయోగించే ముడిసరుకును అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించిన ఎక్సైజ్ అధికారులు దానిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అక్రమ మద్యం తయారీపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా తయారీ, విక్రయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.