పల్లెల సమగ్ర ప్రగతికే తొలి ప్రాధాన్యం

11-11-2026 | 08:34pm
  1. స్వంత జిపి భావనాలతోనే సులభతర పాలన
  2. మహిళా సాధికారతకు వీవో కేంద్రాలు ఊతం
  3. తెలంగాణ పబ్లిక్ స్కూల్ సాధన విద్యారంగంలో నూతన అధ్యాయం
  4. సింగభూపాలెం చెరువు అభివృద్ధితో సాగుకు కొత్త భరోసా
  5. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
  6. రూ.50లక్షలతో నిర్మించిన జీపీ, వివో భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

కొత్తగూడెం టౌన్ నవంబర్ 11 (విజయక్రాంతి): ​సుజాతనగర్: పల్లెల సమగ్ర ప్రగతి, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ప్రధాన ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Koonamneni Sambasiva Rao) అన్నారు. బుధవారం మండల పరిధిలోని బేతంపూడి, మాలబంజర, 2 ఇంక్లైన్ గ్రామాల్లో సుమారు రూ.50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన అభివృద్ధి భవనాలను ఆయన రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.

బేతంపూడి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో, మాలబంజరలో మరో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన భవనాలను, 2 ఇంక్లైన్ పంచాయతీ పరిధిలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య (వీవో) భవనాన్ని ఆయన ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సమావేశాల్లో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. స్థానిక సంస్థలకు సొంత భవనాలు సమకూరినప్పుడే గ్రామీణ పరిపాలన సమర్థవంతంగా సాగుతుందని, ప్రజలకు సేవలు వేగంగా అందుతాయని తెలిపారు.

మహిళల ఆర్థిక, సామాజిక వికాసానికి వీవో భవనాలు వేదికలుగా నిలవాలన్నారు. మండలానికి జూనియర్ కళాశాల ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అని, తెలంగాణ పబ్లిక్ స్కూల్'ను సాధించి వారి ఆశలు నెరవేర్చడం ద్వారా నూతన అధ్యాయానికి నంది పలికామని అదేవిధంగా సింగభూపాలెం చెరువు అభివృద్ధిపై ద్రుష్టి సారించి నిధుల వరద కురిపించడం ద్వారా సాగుకు భరోసా కల్పించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

ప్రజా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, నాయకులు భూక్యా దస్రు, కొమారి హన్మంతరావు, జక్కుల రాములు, తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపిడివో భారతి, పిఆర్ డీఈ నాగేందర్, ఏఈ నవీన్ కుమార్, విద్యుత్ ఏఈ కిషన్, గ్రంధాలయ చైర్మన్ వీరబాబు, మండే హన్మంతరావు, స్థానిక నాయకులు గుగులోత్ బాలు, కొమ్య, నాగేంద్రబాబు, భాగం కృష్ణ, హత్తిరం, ఆకుల వెంకన్న, సారయ్య, కృష్ణ, భూక్యా రవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు