మదన పోచమ్మ ఆలయ హుండీకే కన్నం!
- రూ.20 వేల నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు మాయం!
- ఆలయ పూజారిపై పోలీసుల కేసు నమోదు..
కోటపల్లి,( విజయక్రాంతి ): భక్తితో అమ్మవారికి సమర్పించిన కానుకలకే రక్షణ లేకుండా పోయింది. భక్తులు ఎంతో నమ్మకంతో మదన పోచమ్మ ఆలయ హుండీలో(Pochamma Temple Offering Box) వేసిన కానుకలు మాయమైన ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జనగాం గ్రామంలో కలకలం రేపింది. హుండీలో ఉన్న సుమారు రూ.20 వేల నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు అపహరణకు గురైనట్లు ఆరోపణలు రావడంతో ఆలయ పూజారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. జనగాం గ్రామంలోని మదన పోచమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే జాతరకు గ్రామస్తులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 24 నుంచి 26 వరకు జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలో నవంబర్ 10న గ్రామ పంచాయతీ కార్యదర్శి బొల్లం సందీప్ గ్రామస్తులతో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేసేందుకు వెళ్లారు. జాతర ఖర్చుల కోసం హుండీలోని కానుకలను లెక్కించేందుకు హుండీని తెరిచి చూడగా అందులో నగదు, బంగారు, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు.
దీంతో ఆలయ పూజారి నాయిని పోసక్కను గ్రామస్తుల సమక్షంలో విచారించగా, హుండీలోని నగదుతో పాటు ఆభరణాలను తానే తీసుకున్నట్లు తెలిపినట్లు పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై బొల్లం సందీప్ ఫిర్యాదు మేరకు కోటపల్లి ఎస్సై రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.