సమన్వయంతోనే మండల అభివృద్ధి

11-11-2026 | 08:54pm

అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి: ఎమ్మెల్యే పాయం

బూర్గంపాడు,(విజయక్రాంతి): అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ మండల అభివృద్ధికి కృషి చేయాలని పినపాక ఎమ్మెల్యే, శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ ఛైర్మన్‌ పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) సూచించారు. బుధవారం బూర్గంపాడు రైతు వేదికలో నిర్వహించిన మండలస్థాయి అన్ని శాఖల అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరు, అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలుపై శాఖల వారీగా సమీక్షించారు.

ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.సమావేశంలో పాల్గొన్న సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్యుత్తు, డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన సంబంధిత శాఖల అధికారులు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో జమలారెడ్డి, తహశీల్దార్ ప్రసాద్, వివిధ శాఖ అధికారులు, సర్పంచ్ లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు