ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ అభినందనీయం: మంత్రి ఉత్తమ్
కోదాడ నవంబర్ 11 (విజయక్రాంతి): పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకురావడం ఎంతో అభినందనీయమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) పేర్కొన్నారు.
బుధవారం కోదాడ బైపాస్ రోడ్డులోని కాకతీయ సేవా సమితి కళ్యాణ మండపంలో శంకర నేత్రాలయ సహకారంతో రావెళ్ల సీతారామయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పొర చికిత్స శిబిరాన్ని నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరారెడ్డి, కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందారావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి తోడుగా నిలుస్తూ పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న కాకతీయ సేవా సమితి ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు.
ఎంపీ రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఉచిత సేవలను మరింత వేగవంతం చేసేందుకు అవసరమయ్యే ఆధునిక వైద్య పరికరాల కొనుగోలు కొరకు తన ఎంపీ నిధుల నుంచి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా మొదటి రోజు 200 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ, కాకతీయ సేవా సమితి అధ్యక్షులు పెదనాటి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వేమూరి సురేష్, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, రావిళ్ళ సీతారామయ్య, పోటు రంగారావు, డాక్టర్ జాస్తి సుబ్బారావు, మార్తి మాధవరావు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.