మౌలానా ఆజాద్ ఆశయాల సాధనకు విద్యార్థులు కృషి చేయాలి
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల జాతీయ సేవా పథకం(National Service Scheme) (ఎన్ఎస్ఎస్) యూనిట్ ఆధ్వర్యంలో భారత తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి, జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను(National Education Day celebrations) ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ఎం. పవన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. దార్శనికుడు, విద్యావేత్త, తత్వవేత్త, కవి, రచయిత అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ చూపిన మార్గం నేటి విద్యార్థులకు ఆదర్శప్రాయమన్నారు. ఆధునిక విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకున్న చొరవతోనే ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు పునాదులు పడ్డాయని తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించడం ద్వారా ఆజాద్ ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బానోత్ బాబురావు, అధ్యాపకులు బసవమ్మ, సత్యవతి, శంకర్రావు, వేణుగోపాల్, శ్రీనివాసరావు, ప్రమోద్ కుమార్, సంజీవరెడ్డి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.