ఇల్లెందు మున్సిపాలిటీకి త్వరలో నిధుల కేటాయింపు

15-11-2026 | 09:42pm

రూ.50 కోట్ల హామీని గుర్తు చేసిన చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర

మైనార్టీ స్మశాన వాటిక ప్రహరీ నిర్మాణానికి రూ.60 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి హామీ

ఇల్లెందు టౌన్, నవంబర్ 15 (విజయక్రాంతి): ఇల్లెందు మున్సిపాలిటీ(Illendu Municipality) అభివృద్ధి, పట్టణ సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు త్వరలో కేటాయిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) హామీ ఇచ్చారు. ఆదివారం మంత్రిని ఇల్లెందు మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress party leaders), కౌన్సిలర్లతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇల్లెందు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మంత్రితో చర్చించారు.

గతంలో ఇల్లెందు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేస్తామని మంత్రి ఇచ్చిన హామీని చైర్‌పర్సన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి త్వరలో ఇల్లెందు మున్సిపాలిటీకి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇల్లెందు ఒకటో, రెండో వార్డులకు సంబంధించిన ముస్లిం మైనార్టీ స్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మించాలని మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కలెక్టర్‌తో మాట్లాడి రూ.60 లక్షలు మంజూరు చేయిస్తామని తెలిపారు.

మరోవైపు మున్సిపాలిటీలో పూర్తిస్థాయి రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో పరిపాలనలో ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, ఆయా స్థానాల్లో పూర్తిస్థాయి అధికారులు నియమించాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి వెంటనే అధికారుల మార్పు చేపడతామని హామీ ఇచ్చారు.

ఇల్లెందు మున్సిపాలిటీకి ఏ లోటు లేకుండా చూసే బాధ్యత తమదేనని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పులిగండ్ల మాధవరావు, 20వ వార్డు కౌన్సిలర్ ఎండీ జాఫర్, సీనియర్ నాయకులు పర్రె శీను, పందిళ్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు