జిల్లా విద్యాశాఖలో వింతలు

15-11-2026 | 10:28pm
  1. అడిగినంత ఇచ్చుకో.. కోరిన ప్రదేశంలో కొలువులు..
  2. తీవ్రమైన నేరాలైనా పోలీసులకు బద్రాయింపులు లేవు 
  3. ఎమ్మెల్సీ అండ, ఆర్థిక లావాదేవీలు?

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) విద్యాశాఖలో(Department of Education) వింత లీలలు కొనసాగుతున్నాయి. విద్యాశాఖ కార్యాలయం ఉత్తర, దక్షిణాలకు నిలయంగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగా తాజాగా ఇల్లందు మండలం(Yellandu Mandal) మర్రిగూడెం ఉపాధ్యాయుడి సస్పెండ్(Teacher suspended), రీ పోస్టింగ్ విధానమే తార్కాణం. 

మర్రిగూడెం ప్రధానోపాధ్యాయులు డి రమేష్ గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా హాజరు రిజిస్టర్లో తప్పులు నమోదు చేయటం, అర్హత లేని సెలవులకు సైతం పూర్తిస్థాయి వేతనం మంజూరు చేయాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి చేయడం, గ్రామస్తులకు తప్పుడు సమాచారం ఇచ్చి తెల్ల కాగితంపై సంతకాలు చేయించి దుర్వినియోగానికి పాల్పడడం, విధి నిర్వహణలో, అటెండెన్స్ రిజిస్టర్ లో లోపాలు ఉన్నట్లు అతనిపై అనేక ఆరోపణలు ఉన్నాయి.

గత రెండు సంవత్సరాలుగా ఐదుగురు అధికారులు విచారణ నిర్వహించి తగ్గిన ఆధారాలతో నివేదిక సమర్పించిన చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఈ అంశంపై అనేక ఆరోపణలు వెలబడటంతో విద్యాశాఖ ఎట్టకేలకు ఈనెల 5వ తేదీన డి రమేష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అతని సస్పెన్షన్ ఉత్తరువు తంతే గారెల బుట్టలో పడినట్టుగా మారింది. జిల్లా అధికారులు అతన్ని మారుమూల మర్రిగూడెం గ్రామం నుంచి పట్టణ పరిధిలోని ఇల్లందు సంజయ్ నగర్ ఎంపీపీ పాఠశాలకు పోస్టింగ్ ఇవ్వడం కోసమెరుపు.

గతంలో గుండాల మండలంలో పనిచేసిన సమయంలో ఓ అవివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీస్ కేసు నమోదయినట్లు తెలుస్తోంది. దీంతో అతన్ని సస్పెండ్ చేసి అనంతరం ఇల్లందు మండలానికి కేటాయించారు. దీంతో మర్రిగూడెంలో ప్రధానోపాధ్యాయుడిగా విధుల్లో చేరారు. సస్పెండ్ అయిన అతనిలో ఎలాంటి మార్పు కనిపించకపోగా యధాతధంగానే కొనసాగింది. ఎనిమిది సంవత్సరాల కాలం పూర్తి అయిన నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చిలో జరిగే బదిలీల్లో సుధీర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది.

అతని అక్రమాలకు విద్యాశాఖ సస్పెండ్ వేటు వేయడం అతనికి వరంగా మారింది. సస్పెండ్ ను ఆసరా చేసుకొని అధికారులకు అడిగినంత చెల్లించి  ఇల్లందు నడిబొడ్డులో గల సంజయ్ నగర్ లో పోస్టింగ్ పొందినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా గతంలో తుది విచారణ పూర్తి కాకుండానే సస్పెన్షన్ ఆసరాగా జూలూరుపాడు మండలంలో ఓ ఉపాధ్యాయుని చర్ల మండలంలోని ఓ మారుమూల గ్రామానికి బదిలీ చేశారు. చర్ల మండలం నుంచి మరో ఉపాధ్యాయుని టేకులపల్లి మండలంలోని మారుమూల గ్రామంతో పాటు, అశ్వరావుపేట మండలాన్ని కేటాయించారు.

వీరిపై ఎలాంటి అక్రమాలు రుజువు కాలేదు అయినా వేటు తప్పలేదు. మర్రిగూడెం ఉపాధ్యాయుడిపై సాక్షాధారాలతో నివేదిక సమర్పించిన వేటుపడకపోవడం పైసలిస్తే ఒక న్యాయం, ఇవ్వకపోతే మరొక న్యాయం అన్నట్టుగా జిల్లా విద్యాశాఖ పనితీరు ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కల్పించుకొని జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న వింత లీలలపై సమగ్ర విచారణ నిర్వహించి అక్రమాలకు పాల్పడిన ఉపాధ్యాయులపై తగు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు