పాల్వంచలో టీఎస్ఐఐసి భూమిపై అక్రమనదారుల కన్ను?
ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికుల డిమాండ్
పాల్వంచ, నవంబర్ 14, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ పట్టణంలోని 817 సర్వే నంబర్ పరిధిలో శివనగర్, తెలంగాణ నగర్ కాలనీల మధ్య ఉన్న తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(Telangana State Industrial Infrastructure Corporation) ( టీఎస్ ఐఐసి)కు చెందిన సుమారు వెయ్యి గజాల భూమిపై అక్రమార్కుల కన్నుబడిందనీ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వ్యక్తులు ఆ స్థలాన్ని శుభ్రం చేస్తూ, సదరు భూమి తమదేనని చెబుతుండటంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
స్థానికుల కథనం ప్రకారం.. సుమారు 40 సంవత్సరాలుగా ఈ భూమి పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధీనంలో ఉంది. గతంలో కూడా కొందరు వ్యక్తులు ఈ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించగా, అప్పటి తహశీల్దార్‌తో పాటు టి ఎస్ ఐ ఐ సి అధికారులు ఆక్రమణ ప్రయత్నాలను అడ్డుకున్నారు. అనంతరం ఆ స్థలంలో ఉన్న షెడ్ల వద్ద టీఎస్ఐఐసి కి చెందిన భూమిగా హెచ్చరిక బోర్డులను(Warning sign) ఏర్పాటు చేశారు. సుమారు ఏడాది క్రితం ఈ భూమిలో కొంత భాగాన్ని విద్యుత్ శాఖకు బదలాయించగా, అక్కడ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం(Construction of an electrical substation) చేపట్టారు.
అయితే సబ్‌స్టేషన్ నిర్మాణం అనంతరం మిగిలిన భూమితో పాటు అక్కడ షెడ్లు ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా కొందరు వ్యక్తులు మిగిలిన స్థలాన్ని శుభ్రం చేస్తూ ఈ భూమి తమదేనని చెబుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా అధికారంలో ఉన్న ఓ కీలక వ్యక్తి తమను ఇక్కడ ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారని వారు చెబుతున్నట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వ సంస్థకు చెందిన విలువైన భూమి ఆక్రమణకు గురికాకుండా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.