మౌలిక వసతుల విస్తరణే లక్ష్యంగా ముందడుగు
- మహిళా సంఘాల బలోపేతానికి చేయూత
- రహదారులు, డ్రైనేజీలతో మెరుగైన పారిశుధ్యం
- ప్రజల చెంతకే సత్వర సేవల వ్యవస్థ
- కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
- రూ.47 లక్షల వ్యయంతో నిర్మించిన అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే..
కొత్తగూడెం టౌన్ నవంబర్ 11 (విజయక్రాంతి): క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విస్తరణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Koonamneni Sambasiva Rao) పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని పెనగడప-అంబేద్కర్ నగర్, వెంకటేశ్వర కాలనీ, బంజారాహీల్స్ నందతాండా, గరిమెళ్ళపాడు ప్రాంతాల్లో దాదాపు రూ. 47 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
అంబేద్కర్ నగర్లో రూ. 10 లక్షలు, వెంకటేశ్వర కాలనీలో రూ. 10 లక్షలతో నిర్మించిన వీవో భవనాలతో పాటు, నందతాండాలో రూ. 12 లక్షలతో పూర్తి చేసిన అంతర్గత సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం గరిమెళ్ళపాడులో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, మురుగు కాలువల పనులను ప్రారంభించి ప్రజల వినియోగానికి అప్పగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా సంఘాల బలోపేతానికి, పొదుపు సమాఖ్యల నిర్వహణకు వీవో భవనాలు ఎంతో కీలకంగా ఉపయోగపడతాయన్నారు.
బస్తీలు, కాలనీల్లో సీసీ రహదారులు, డ్రైనేజీల నిర్మాణంతో స్థానిక పారిశుధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతృప్తికరమన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం దృష్టి సారిస్తూ పల్లె, పట్టణ ప్రగతికి తోడ్పాటునందిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, నాయకులు సలిగంటి శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, తహసీల్దార్ నాగరాజు, ఎంపివో సంధ్య, పిఆర్ డీఈ నాగేందర్, ఏఈ నవీన్ కుమార్, ఏపీఎం సిసి రమాదేవి, నాయకులు నీడలా సుధాకర్, మన్నెం వెంకన్న, సర్పంచ్ సీతారాములు, సర్పంచ్ వాడే రాములు, జగదాంబ, గుగులోత్ నగేష్, రమేష్, అంకుష్, రవి, తాజుద్దీన్, నవీన్, ఉదయ్, తూముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.