రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్‌కు 6 ఉత్తమ ప్రదర్శనలు ఎంపిక!

11-11-2026 | 08:41pm

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 11, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆనందఖనిలోని జిల్లా శిక్షణ కేంద్రంలో 32వ జిల్లా స్థాయి నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనలు(National Children's Science Congress Exhibits) బుధవారం అత్యంత ఘనంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు సమర్పించిన మొత్తం 107 ప్రాజెక్టులలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 6 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి.

ఈ వినూత్న శాస్త్రీయ ప్రదర్శనల కార్యక్రమానికి జిల్లాలోని 107 పాఠశాలల నుండి రిజిస్ట్రేషన్ చేసుకున్న 240 మంది విద్యార్థులు హాజరై, తమ పరిశోధనా నైపుణ్యాలను, వినూత్న ఆలోచనలను ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. శంభూ ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, నిత్యజీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు కనుగొనే దిశగా ఆలోచించాలని పిలుపు నిచ్చారు.

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, నైపుణ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు బోధన సాగించాలని ఆయన సూచించారు.జిల్లా సైన్స్ అధికారి బి. సంపత్ కుమార్ , మానిటరింగ్ అధికారి మాధవరావు మాట్లాడారు. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ సుమలత, సంధ్యారాణి, నాగమణి ప్రసన్నఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

మరిన్ని వార్తలు