హమ్మయ్య నో ట్రా"ఫికర్"

17-11-2026 | 08:27pm
  1. దశాబ్దాల పట్టణ ట్రాఫిక్ సమస్య తీరినట్లే 
  2. ఎంపీ రామ సహాయం  రఘురాంరెడ్డి ఎమ్మెల్యే కూనంనేని చొరవ
  3. రైల్వే స్టేషన్ టు హేమచంద్రపురం రోడ్డు విస్తరణ పనులు
  4. హర్షం వ్యక్తం చేసిన పట్టణ ప్రజానీకం

కొత్తగూడెం, నవంబర్ 17( విజయ క్రాంతి): పట్టణ ప్రజలను కొన్ని దశాబ్దాల కాలం నుంచి  వేధిస్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కీలక ముందడుగు పడింది. కొత్తగూడెం రైల్వే స్టేషన్(Kothagudem Railway Station) నుంచి హేమచంద్రాపురం వెళ్లే ప్రధాన రహదారి విస్తరణకు అవసరమైన రైల్వే భూములను రెవెన్యూ శాఖకు అప్పగించే ప్రక్రియ పూర్తయింది.

సుమారు 15 నుంచి 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య పరిష్కారానికి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోగా, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమన్వయ సహకారం అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మంగళవారం రైల్వే స్టేషన్ వద్ద ఎంపీ సమక్షంలో భూముల అప్పగింత కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కొత్తగూడెం పర్యటనకు వచ్చిన సమయంలో స్థానికులు హేమచంద్రాపురం రోడ్డు విస్తరణ సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. అప్పటి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సహకారంతో భూముల సర్వే, మార్కెట్ విలువ నిర్ధారణ, ప్రతిపాదనల రూపకల్పన చేపట్టినట్లు వివరించారు.

దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో చర్చలు జరిపి భూముల మార్పిడికి అంగీకారం సాధించినట్లు పేర్కొన్నారు.  భూముల మార్పిడిలో భాగంగా కొత్తగూడెంలో రైల్వే శాఖకు చెందిన సుమారు 5,500 చదరపు గజాల భూమిని రోడ్డు విస్తరణ కోసం రెవెన్యూ శాఖకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. దీనికి ప్రతిగా ఖమ్మం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సుమారు 4,500 చదరపు గజాల భూమిని రైల్వే శాఖకు కేటాయించను న్నట్లు వెల్లడించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారంతో ప్రభుత్వ అనుమతులు, భూముల మార్పిడి ప్రక్రియ ముందుకు సాగిందన్నారు.మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ.. హేమచంద్రాపురం రోడ్డు విస్తరణ పట్టణ ప్రజల చిరకాల ఆకాంక్ష అని పేర్కొన్నారు.

భూముల సమస్య పరిష్కారమైన నేపథ్యంలో త్వరలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కొత్తగూడెం  కార్పొరేషన్ నిధుల నుంచి సుమారు కోటి రూపాయలతో సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టినట్లు వివరించారు.  కొత్తగూడెం పట్టణంలో రైల్వే లైన్‌కు ఈ వైపున ఉన్న ఐదు ప్రధాన రహదారులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.

సూర్య ప్యాలెస్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు, గణేష్ టెంపుల్ నుంచి ప్రగతి వన్ నగర్ వరకు రహదారుల విస్తరణ, ఆధునిక లైటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పట్టణాన్ని మెరుగైన మౌలిక సదుపాయాలతో ఆధునిక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ పేరును కొత్తగూడెంగా మార్చేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, తహసీల్దార్ పుల్లయ్య, రైల్వే రీజినల్ ఇంజనీర్ శశాంక్, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న సీపీఐ నాయకులు సాబీర్ పాషా, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు