నిబంధనలకు నీళ్లు.. తప్పిదాలపై తప్పిదాలు..!

16-11-2026 | 03:33pm
  1. - ఆ ఉపాధ్యాయుడి కోసం అధికారుల అష్టకష్టాలు..!
  2. - సస్పెన్షన్ ఎత్తివేతలోనూ నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు
  3. - విధుల్లో చేరకముందే పాఠశాలకు వెళ్లినట్లు ప్రచారం
  4. - బదిలీ ఉత్తర్వులు సవరించినా మారని తీరు
  5. - అధికారుల ఆదేశాలకు విలువ లేదా? అన్న ప్రశ్నలు

ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లెందు మండలంలో ఓ ఉపాధ్యాయుడి వ్యవహారం విద్యాశాఖ(Education Department) అధికారులకు తలనొప్పిగా మారిందా? ఒకవైపు సస్పెన్షన్‌.. మరోవైపు తిరిగి విధుల్లోకి తీసుకోవడం.. ఆ తర్వాత విధుల కేటాయింపులో సవరణలు.. ఇలా వరుస పరిణామాలు చోటుచేసుకుంటున్నా నిబంధనల అమలుపై మాత్రం ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సదరు ఉపాధ్యాయుడి విషయంలో అధికారుల వ్యవహారశైలిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సస్పెన్షన్‌ అనంతరం తిరిగి విధుల్లోకి తీసుకున్నప్పటికీ, విధుల్లో చేరే ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా డీఈవో ఉత్తర్వుల మేరకు ముందుగా ఎంఈవోకు జాయినింగ్‌ రిపోర్టు సమర్పించి, అక్కడి నుంచి స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంకు రిపోర్టు చేసిన అనంతరం కేటాయించిన పాఠశాలలో విధుల్లో చేరాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ నెల 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు డీఈవో తిరిగి విధుల్లో చేరేందుకు ఉత్తర్వుల కాపీ అందజేయగా, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకే సదరు ఉపాధ్యాయుడు నేరుగా పాఠశాలలో విధుల్లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తర్వులు అందకముందే విధుల్లో ఎలా చేరారు? ఇందుకు అనుమతి ఎవరిచ్చారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. తొలుత ఇల్లెందు పట్టణంలోని సంజయ్‌నగర్‌ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సదరు ఉపాధ్యాయుడిని టేకులపల్లి మండలం కొప్పురాయి పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం పాఠశాలకు కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు సవరించినట్లు సమాచారం. అయినప్పటికీ ఆయన ఇప్పటికీ సంజయ్‌నగర్‌ పాఠశాలలోనే కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

*మారుతున్న ఉత్తర్వులు.. మారని పరిస్థితి!*

ఒకసారి సస్పెన్షన్‌, మరోసారి విధుల్లోకి తీసుకోవడం, ఆపై విధుల కేటాయింపులో సవరణలు.. ఇలా వరుసగా నిర్ణయాలు తీసుకుంటున్నా వాటి అమలు ఎందుకు ప్రశ్నార్థకంగా మారుతోంది? అధికారుల ఉత్తర్వులను అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు వస్తున్న ఆరోపణలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. సదరు ఉపాధ్యాయుడి వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని వార్తలు