భారత్ వృద్ధి 7 శాతం
- ప్రకటించిన ఐఎంఎఫ్
- 2026-27 జీడీపీ అంచనా విడుదల
- ప్రపంచ వృద్ధిరేటు 3.4 శాతం
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: భారతదేశ జీడీపీ వృద్ధి(India's GDP growth) రేటు 2026-27కు గాను ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ) 7 శాతానికి పెంచింది. ప్రపంచ అనిశ్చితులున్నా విస్తరిస్తున్న దేశీయ మార్కెట్(Domestic market), బలమైన నిర్మాణాత్మక సంస్కరణల నేపథ్యంలో వృద్ధిరేటును మంగళవారం ప్రకటించింది. జూలైలో 6.4 శాతంగా ఉన్న వృద్ధి రేటును 7 శాతానికి ఐఎంఎఫ్ సవరించింది. ఈ ఏడాది తన జీడీపీ వృద్ధిరేటును ఆర్బీఐ 7.1 శాతానికి పెంచిన కొద్దిరోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది.
విస్తరిస్తున్న దేశీయ మార్కెట్, కొనసాగుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు, నిలకడైన వేగానికి, బలమైన వృద్ధి సామర్థ్యాలను ప్రతిబింబిస్తున్నాయని ఐఎంఎఫ్ నివేదిక స్పష్టం చేసింది. అమెరికా-ఇరాన్, రష్యా--ఉక్రెయిన్ వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశ వృద్ధి అంచనాను పెంచడం గమనార్హం.
ఈ రెండు పరిణామాలు భారత్ వంటి ఇంధనంపై ఆధారపడిన దేశంపై ప్రభావం చూపుతాయి. అధిక చమురు ధరలు ఉన్నప్పటికీ, దేశీయ డిమాండ్, సేవల రంగం మద్దతుతో భారతదేశ వృద్ధి బలంగా కొనసాగిందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. కాగా ప్రపంచ వృద్ధి రేటు 3.1 శాతం నుంచి 2027కు గాను 3.4 శాతానికి సవరించింది.