రియల్టీ షేర్ల జోరుతో లాభాల్లో ముగిసిన స్టాక్

12-11-2026 | 04:28pm

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. రియల్టీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల షేర్లలో కొనుగోళ్లు సూచీలకు అండగా నిలిచాయి. ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి లాభాలను పరిమితం చేసింది. సెన్సెక్స్ (Sensex) 31.61 పాయింట్లు పెరిగి 81,911.01 వద్ద స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 44.30 పాయింట్లు లాభపడి 25,299.35 వద్ద ముగిసింది.

మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు ప్రధాన సూచీల కంటే మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్-100 సూచీ 0.85 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్-100 సూచీ 1.12 శాతం చొప్పున పెరిగాయి.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ సూచీ ఏకంగా 4 శాతం ఎగబాకి అగ్రస్థానంలో నిలిచింది. పీఎస్‌యూ బ్యాంక్, మీడియా, బ్యాంక్ సూచీలు కూడా లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ ఆటో సూచీ అత్యధికంగా నష్టపోయింది. నిఫ్టీ షేర్లలో మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్ నష్టాలతో ముగిశాయి.

నిఫ్టీ గత రెండు మూడు ట్రేడింగ్ సెషన్లుగా పరిమిత శ్రేణిలో కదులుతున్నప్పటికీ, మొత్తం మీద సానుకూల ధోరణి కొనసాగుతోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. సూచీ ఓవర్‌బాట్ స్థాయిలో ఉండటంతో స్వల్ప దిద్దుబాటుకు (Correction) అవకాశం ఉందని అంచనా వేశారు. 25,000 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, 24,800 వద్ద కీలక మద్దతు ఉన్నాయని తెలిపారు. పైవైపు 25,500 పాయింట్ల వద్ద నిరోధం ఎదురుకావచ్చని, ప్రస్తుతానికి 25,000-25,500 శ్రేణిలో సూచీ కదలొచ్చని విశ్లేషించారు.

మరిన్ని వార్తలు