జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించాలి

29-11-2026 | 08:37pm

విజయవంతంగా 406వ వారం అంబేద్కర్‌కు జ్ఞానమాల కార్యక్రమం

మహనీయుల జీవితాలు యువతకు స్ఫూర్తిదాయకం.. నత్తి మైసయ్య

మేడిపల్లి, నవంబర్ 29 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు పూలే(Mahatma Jyotirao Phule) ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని, ఆయన చూపిన సమానత్వం, విద్య, సామాజిక న్యాయం మార్గంలో యువత ముందుకు సాగాలని అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య పిలుపునిచ్చారు. ఆదివారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలో నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి 406వ వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం నత్తి మైసయ్య మాట్లాడుతూ కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనతో పాటు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యాభివృద్ధికి జ్యోతిరావు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు మహనీయులు చేసిన పోరాటాలు నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. యువత మహనీయుల జీవిత చరిత్రలను అధ్యయనం చేసి వారి ఆశయాలను ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గ మైసయ్య, బోడుప్పల్ అరుంధతి మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గరుగుల యాకయ్య, సాయి బండారి, రాపోలు వెంకటేష్, చిల్ల అంజయ్య, సగ్గు నరసింహ, గుంజ శ్రీనివాస్, రఘురూపుల మల్లేష్, కంచి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు