నగరాలకు దీటుగా కోదాడ అభివృద్ధి

29-11-2026 | 08:56pm

ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి

నియోజకవర్గ ప్రజలకు 23 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ

కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం కార్తీక వనభోజనాల్లో వెల్లడి

కోదాడ నవంబర్ 29 (విజయక్రాంతి): నగరాలకు దీటుగా కోదాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి(MLA Nalamada Padmavathi Reddy) అన్నారు. ఆదివారం కోదాడ పరిధిలోని ఎర్నేని వెంకటరత్నం బాబు మామిడి తోటలో కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వనభోజన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గాన్ని నగరాలకు దీటుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.

ఆ కోణంలోనే ఇప్పటి వరకు కోదాడ నియోజకవర్గానికి 2 వేల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించినట్లు చెప్పారు. కోదాడ పట్టణంలో 100 పడకల వైద్యశాల భవన నిర్మాణానికి తన వాస్తుశిల్ప విద్యతో నమూనా రూపొందించానని, నెల రోజుల్లోపు కొత్త భవనంలో బాహ్య రోగుల సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. 250 కోట్ల రూపాయలతో భూగర్భ మురుగునీటి పారుదల పనులు కొనసాగుతున్నాయని, వీధుల్లో పనుల వల్ల కొంత అసౌకర్యం కలిగినా అవి పూర్తయ్యే వరకు ప్రజలు సహకరించాలని కోరారు.

అన్ని హంగులతో ఆధునిక బస్సు ప్రాంగణ నిర్మాణం ప్రారంభమైందని వివరించారు. నియోజకవర్గంలోని బాధిత కుటుంబాలకు 23 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి అందించినట్లు వెల్లడించారు. తాను శాసనసభ్యురాలిగా గెలవడంలో కమ్మ సామాజిక వర్గ సహకారం మరువలేనిదని, ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తున్నానని అన్నారు. శివుని ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని, కమ్మ కులస్తుల ఐక్యతకు వనభోజనాలు వేదికలుగా నిలిచి సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.

కులంలో ధనిక, పేద వ్యత్యాసాలు లేకుండా ఐక్యత, సోదరభావం, సేవాభావాన్ని పెంపొందించేందుకు కార్తీక మాస సామాజిక సమ్మేళనాలు ఎంతగానో దోహదపడతాయని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి అన్నారు. కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం కోదాడ అధ్యక్షుడు ఎర్నేని వెంకటరత్నం బాబు, కోదాడ పట్టణ ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు, ముత్తవరపు పాండురంగారావు మాట్లాడుతూ కమ్మ కులస్తులు విద్య, వ్యవసాయం, వ్యాపారం, పారిశ్రామిక రంగాలతో పాటు రాజకీయ, సామాజిక రంగాల్లోనూ విశేషంగా రాణిస్తున్నారని తెలిపారు.

గత తరాల నుంచి వస్తున్న కష్టపడే తత్వం, పట్టుదల, దాతృత్వం, సేవా నిరతి వంటి విలువలను భావితరాలకు అందించాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కమ్మ కులస్తులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి పరస్పర పరిచయాలు, ఆత్మీయత, ఐక్యతను పెంపొందించాలనే సంఘం ప్రయత్నం ప్రశంసనీయమన్నారు. ఈ వనభోజన కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన కమ్మ కులస్తులు, మహిళలు, యువత, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయంగా పలకరించుకున్నారు.

చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో కోదాడ పురపాలక సంఘం అధ్యక్షురాలు ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, ఉపాధ్యక్షురాలు మల్లీశ్వరి, పురపాలక అధికారి రమాదేవి, సంఘం నాయకులు కోడె వాసు, ముత్తినేని సైదేశ్వరరావు, ఎర్రవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు నలజాల శ్రీనివాసరావు, ముత్తవరపు రామారావు, సాతులూరి హనుమంతరావు, ఉప్పుగల్ల శ్రీనివాసరావు, వేమూరి విద్యాసాగర్ రావు, సాదినేని అప్పారావు, ముత్తవరపు కోటేశ్వరరావు, పోటు కోటేశ్వరరావు, లింగా జగన్, వెలుగుల చిట్టిబాబు, రావెళ్ల కృష్ణారావు, సామినేని శ్రీనివాసరావు, మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు చుండూరు వెంకటేశ్వరరావు, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు శేషు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు