పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు..

29-11-2026 | 08:49pm

18 మంది పట్టివేత..

నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో కొనసాగిన దాడులు..

రూ.18,690 నగదు, 13 సెల్‌ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం..

కామారెడ్డి, నవంబర్ 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy district)లో పేకాట స్థావరాలపై  జిల్లా పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. జిల్లాలో నాలుగు పోలీస్ స్టేషన్లో వరుస దాడులు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, ఎల్లారెడ్డి, నస్రుల్లాబాద్, బిచ్కుంద పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన దాడుల్లో మొత్తం 18 మందిని పట్టుకున్నారు. దోమకొండ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న నలుగురి వద్ద నుంచి రూ.4,320 నగదు, 3 సెల్‌ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్‌లో పేకాట ఆడుతున్న ముగ్గురి వద్ద నుంచి రూ.6,250 నగదు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మన్‌దేవ్‌పల్లిలో పేకాట ఆడుతున్న నలుగురి వద్ద నుంచి రూ.1,410 నగదు, 2 సెల్‌ఫోన్లు, జుక్కల్ మండలం పెద్ద గుల్ల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో పేకాట ఆడుతున్న ఏడుగురి వద్ద నుంచి రూ.6,710 నగదు, 5 సెల్‌ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను బిచ్కుంద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు చోట్ల జరిపిన దాడుల్లో రూ.18,690 నగదు, 13 సెల్‌ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. యువత తమ విలువైన సమయాన్ని, శక్తిని జూదం వంటి చెడు వ్యసనాలకు బానిసలై వృథా చేసుకోవద్దని సూచించారు. ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని ఎస్పీ జిల్లా ప్రజలను కోరారు.

మరిన్ని వార్తలు