రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి

29-11-2026 | 08:39pm

కొత్తపల్లి, నవంబర్ 29 (విజయక్రాంతి): వ్యవసాయ మార్కెట్ కమిటీ(Agricultural Market Committee) కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మహాత్మా గాంధీ హోల్‌సేల్ వెజిటబుల్ మార్కెట్‌లో కమిషన్ ఏజెంట్లతో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్‌కు ప్రతిరోజూ కూరగాయలు విక్రయించేందుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిషన్ ఏజెంట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చైర్మన్ సూచించారు. రైతులు తీసుకువచ్చిన కూరగాయల సరుకులకు నాణ్యతకు అనుగుణంగా పారదర్శకంగా సరైన ధరలు నిర్ణయించాలని, విక్రయించిన సరుకులకు సంబంధించిన చెల్లింపులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు తీసుకువచ్చిన కూరగాయల సరుకులను కమిషన్ ఏజెంట్లు ఎప్పటికప్పుడు విక్రయించి, సరుకు నిల్వ ఉండకుండా త్వరితగతిన క్లియర్ చేయాలని సూచించారు.ప్రతి లావాదేవీకి సంబంధించి ఖచ్చితమైన రికార్డులు నిర్వహించాలని, మార్కెట్ కమిటీ నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. రైతుల కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభించలని, మార్కెట్‌కు వచ్చే రైతులకు తాగునీరు, పారిశుద్ధ్యం, సరుకుల విక్రయాలు, రవాణా తదితర అంశాల్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మార్కెట్ కమిటీ తరఫున అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రైతుల సంక్షేమం, మార్కెట్‌లో పారదర్శకమైన వ్యాపార లావాదేవీలు, సరుకుల వేగవంతమైన విక్రయాలు, మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా మార్కెట్ కమిటీ నిరంతరం కృషి చేస్తుందని ఆకుల నర్సన్న పటేల్ స్పష్టం చేశారు.ఈ సమీక్ష సమావేశంలో ఏఎంసీ సెక్రటరీ సయ్యద్ హైమత్ అలీ, ఆర్తి అసోసియేషన్ అధ్యక్షుడు యాకూబ్ పాషా, ఆర్తి వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు