దర్యాప్తు ప్రమాణాలు ప్రాచీనత, ఆధునికత

14-10-2026 | 05:00am

పాలకుర్తి రామమూర్తి : 

తైలాభ్యక్తమాశుమృతకం పరీక్షేత..

(కౌటిలీయం- 4-7)

కాలమేదైనా నేరం జరగడం సహజమే. నేరస్థులను(criminals) పట్టుకొని శిక్షించే విధానం అన్ని కాలాలలోనూ ఉండేదే. అయితే నేరం రుజువు చేయబడడం, నేరస్థుడు శిక్షింపబడడం లాంటి పరిణామాలు విచారణాధికారి సమర్థత, నేరం జరిగిన విధానం, ప్రదేశం, లభించిన సాక్ష్యాధారాల లాంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఏ నేరానికి ఆ నేరం ప్రత్యేకమే. దానిని పరిశోధించవలసిన విధానాలు కూడా వైవిధ్యంగానే ఉంటాయి. చాణక్య నేరాలను(Chanakya Crimes) పరిశోధించేందుకు ఉపకరించే కొన్ని సూచనలు చేసాడు.

అయితే అవి అన్ని కాలాలలోనూ ఉపకరిస్తాయని భావించకూడదు. వాటిని ఆనాటికి అందుబాటులో ఉన్న సాంకేతిక విధానాల(Technical methods) ఆధారంగా దర్యాప్తు చేసేందుకు ఉపకరించిన మార్గదర్శక సూత్రాలుగా మాత్రమే భావించాలి. సాంకేతికంగా ప్రగతిని సాధించిన ఈనాటి ఆధునిక న్యాయ, విజ్ఞాన శాస్త్రాల ప్రమాణాల ఆధారంగా చాణక్య సూచనలు ఉపయుక్తం కాకపోయినా, మార్గదర్శకాలుగా మాత్రం నిలుస్తాయని భావించవచ్చు.

సాధారణంగా ఆస్తిపాస్తులు, స్త్రీ మూలకమైన తగాదాలు, వృత్తిపరమైన విభేదాలు, మార్కెట్ స్థలాలపై(Marketplaces) ఆధిపత్య పోరాటాలు, భాగస్వామ్య తగాదాలు.. లాంటివి నేరాలకు ఎక్కువగా కారణమవుతుంటాయి. చిన్న విభేదాలే ఆవేశంలో హత్యలకు, ఆత్మహత్యలకు కారణాలవుతాయి. హత్య స్వయంగా చేసినా, మరొకరిని పురికొల్పినా, దోపిడీలు చేస్తూ భయంతో చంపినా, పొరపాటున ఒకరి బదులుగా మరొకరిని చంపినా.. అది నేరమే. నేర స్వభావం, దాని తీవ్రతను అనుసరించి శిక్షను అనుభవించాల్సిందే. 

ఎవరైనా మరణించాడని తెలిసిన వేళ ముఖ్యంగా అది హత్య కావచ్చని అనుమానం వస్తే.. విచారణాధికారి, ముందుగా మరణించిన వాని శరీరానికి తైలం (నూనె) పూసి, సునిశితంగా పరీక్షించాలి అంటాడు.. ఆచార్య చాణక్య. మరణించిన వాడు మరణించిన సమయంలో ఎలా మరణించాడో తెలిస్తే మరణానికి కారణం తెలుస్తుంది. శరీరంపై కనిపించే లక్షణాల నుంచి మరణ కారణాన్ని గ్రహించాలన్నది చాణక్య భావన. 

ఉదాహరణకు.. మూత్రపురీషాలు విడిచిన వాడు, పొట్ట గాలితో నిండి ఉబ్బిపోయినవాడు, చర్మం ఉబ్బినవాడు, పాదాలు.. చేతులు వాచినవాడు, కండ్లు తేలేసినవాడు, కంఠం మీద గుర్తులున్నవాడు.. ఇలాంటివారు కంఠం నులిమి వేసి చంపబడినట్లుగా గ్రహించాలి. పైలక్షణాలు అన్ని ఉన్నా చేతులు, తొడలూ వంకర తిరిగితే, అతడు ఉరితీయబడినట్లుగా గ్రహించాలి.

చేతులు, పాదాలు, పొట్ట వాచి, కళ్ళూ లోతుకుపోయి, బొడ్డుపైకి వచ్చినవాడు శూలంమీద ఎక్కించి చంపబడ్డాడని తెలుసుకోవాలి. గుధస్థానం, కళ్ళు మూసుకుపోయి, నాలుక కరుచుకొని, పొట్ట ఉబ్బి ఉన్నవాడు నీటిలో మునిగి మరణించాడని గ్రహించాలి. రక్తంతో తడిసి, విరిగి బద్దలైన శరీరం కలవాడు కర్రల చేత గాని, కొరడాల చేత గాని కొట్టి చంపబడ్డాడని గ్రహించాలి. విరిగి చిట్లిన శరీరం కలవాడు పైనుంచి కిందకు పడదోయబడినాడని గ్రహించాలి.. అని అంటారాయన. 

చేతులు, పాదాలు, దంతాలు, గోళ్లు నీలిరంగుగా ఉండి, మాంసం, రోమాలు, చర్మం శిధిలమైపోయి, ముఖం నురుగుచేత పూయబడి ఉన్నట్లయితే అతడు విష్ర పయోగం చేత చంపబడ్డాడని గ్రహించాలి. అవే లక్షణాలుండి రక్తంతో కూడిన కాటు ఉన్నవానిని సర్పం చేతకాని, పురుగు చేతకాని చంపబడినవానిగా తెలుసుకోవాలి. వస్త్రాలు, అవయవాలు అస్తవ్యస్తంగా ఉండి, వాంతులు విరేచనాలు ఎక్కువగా అయినవాడు మత్తు కలిగించే రసాయనం చేత చంపబడినాడని గ్రహించాలి.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. ఎవరో అతనిని చంపివేసి దండన భయంవల్ల అతడే ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా సన్నివేశాన్ని సృష్టించారని గ్రహించాలి. చనిపోయిన వ్యక్తి తినగా మిగిలిన ఆహార పదార్ధాలను పక్షులకు వేసి పరీక్షించాలి, లేదా అతని గుండె నుండి చిన్న ముక్కను తీసి నిప్పులో పడవేసి పరీక్షించాలి. అలా వేసిన సమయంలో అది చిటపట శబ్ధం చేసినా లేదా రంగుల వలయంగా కనిపించినా అది విషపూరితమైనదిగా భావించాలి. 

మరణించిన వ్యక్తికి శత్రువులెవరైనా ఉన్నారా? ఎవరితోనైనా పోట్లాడడం, ఎవరికైనా అపకారం చేయడం లేదా అమితమైన కష్టాలు ఎదుర్కొనడం లాంటి కారణాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకోవాలి. ఆ వ్యక్తి మరణిస్తే అతని ఆస్తిపాస్తులు ఎవరికి చెందుతాయో విచారించాలి. అతని మరణం వల్ల అతని భార్యను పొందవచ్చనే ఆలోచనలు కలిగిన వారెవరైనా ఉన్నారా విచారించాలి. అలాంటి వ్యక్తులు అతనిని చంపి అతనిది ఆత్మహత్యగా చిత్రీకరించే అవకాశం కూడా తోసివేయరానిది. 

హత్య జరిగిన ప్రదేశంలో లభించిన ఆధారాలను భద్రపరచి విచారణాధికారి అక్కడ ఉన్న వ్యక్తులను విచారించాలి. హతుడు ఎవరితో కలిసి వెళ్లాడు.. ఎవరిచేత ఆ స్థలానికి పిలిపించబడ్డాడు.. అనుమానాస్పద వ్యక్తులు గానీ, ఆయుధాలు ధరించిన వ్యక్తులు గానీ ఎవరైనా కనిపించారా.. అన్న విషయాలను నేరం జరిగిన ప్రదేశంలోని వ్యక్తులను, అతడి బంధువులను ఒక్కొక్కరిని, వేరువేరుగా విచారించి వివరాలు సేకరించాలి. అవసరానుగుణంగా అనుమానితుల గృహాలనూ సోదాచేయాలి. అలాగే హతుని మృతదేహంపై గల వస్త్రాలను, ఆభరణాలను పరిశీలించి అవి ఎవరు అమ్ముతారో విచారించాలి, అంటాడు చాణక్య. 

ఇలాంటి లక్షణాల ఆధారంగా మరణ కారణాన్ని నిర్ధారించే ఈ ప్రాచీన పద్ధతులను ఆధునిక న్యాయ-వైద్య ప్రమాణాల వెలుగులో ఒక ఉదాహరణతో పరిశీలిద్దాం.

ఒక వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించాడని అనుకుందాం. మొదట చూసిన వారు దాన్ని ఆత్మహత్యగా భావించారు. కానీ విచారణాధికారి శరీరం, గది, చుట్టుపక్కల పరిస్థితులను కలిపి పరిశీలించాడు. అప్పుడు శరీరాన్ని పరిశీలించిన సమయంలో మెడపై ఒక గుర్తు ఉంది.. కానీ అది ఉరి వల్ల ఏర్పడిందా, లేక మరణానికి ముందే ఏర్పడిన గాయమా అన్నది స్పష్టంగా లేదు. చేతులపై గాయాలు, గోళ్ల కింద చర్మపు ఆనవాళ్లు కనిపించాయి. ముఖం, పెదవుల రంగులో మార్పు ఉంది. అయితే ఇవి మాత్రమే విష్ర పయోగం లేదా గొంతు నులిమివేతకు సాక్ష్యాలు కావని విచారణాధికారి భావించాడు. అందుకే శరీరంపై ఇతర దెబ్బల గుర్తులు ఉన్నాయా, అవి మరణానికి ముందు వచ్చాయా అన్నది వైద్యపరీక్షకు పంపించాడు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించినప్పుడు ఉరి పోసుకున్న వస్తువు, దాని ఎత్తు, శరీరం ఉన్న స్థానం నమోదు చేశాడు. గది ప్రవేశద్వారాలు, వస్తువుల కదలికలు, రక్తపు ఆనవాళ్లను పరిశీలించాడు. మృతుడికి దగ్గరలో ఏదైనా లేఖ ఉన్నదా.. ఉంటే అది అతని చేతిరాతతో సరిపోతుందా.. అది నిజమైన లేఖయా.. లేక సృష్టించబడిందా, అతని మానసిక స్థితి ఎలాంటిది, ఇలా పలు అంశాలను పరిశీలించాడు.

కుటుంబ సభ్యులతోనూ, ఇరుగుపొరుగు వారితోనూ, అతని మిత్రులతోనూ, చివరిసారిగా అతనితో మాట్లాడిన వారి వాంగ్మూలాలను తీసుకున్నాడు. చివరగా అతని శవాన్ని వైద్య-న్యాయ పరీక్షకు పంపించాడు. అలాగే శవ పరీక్షలో మెడపై కనిపించిన గుర్తు ఉరి వల్ల ఏర్పడే లక్షణాలకు సరిపోతుందా, శరీరంపై గాయాలున్నాయా, పెనుగులాటలేమైనా జరిగాయా, అన్న అంశాలను పరిశీలించాడు. రక్తాన్ని, కడుపులోని పదార్థాలను, అవయవ నమూనాలను విషపరీక్షకు పంపాడు.

ఇలా పలు కోణాలలో పరిశీలించి, అనుమానాలన్నీ నివృత్తి చేసుకున్నాక మాత్రమే ఒక నిర్ణయానికి రావడం విచారణాదికారి సమర్థతకు ప్రాతిపదికగా నిలుస్తుంది. చాణక్య కాలం నాటి పరిశోధనా పద్ధతులను ఈనాడు యథాతథంగా అనుసరించడం సాధ్యపడదు. కానీ ప్రాథమిక పరిశీలనాంశాల పట్ల జాగ్రత్త వహించాలనీ, అనుమానించదగిన చిన్న అంశాన్నీ విస్మరించకూడదని, ప్రత్యామ్నాయ అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని, సమగ్ర ఆధారాలతో కూడిన నివేదిక ఆధారంగానే నిర్ణయానికి రావాలనే సూచన మాత్రం ఏ కాలానికైనా అనువర్తించేదే.  

మరిన్ని వార్తలు