చాణక్య, మాస్లోల దృక్కోణాలు

18-11-2026 | 05:00am

పాలకుర్తి రామమూర్తి :

అలబ్ధలాభార్థా, లబ్ధపరిరక్షణీ, రక్షితవివర్ధనీ, వృద్ధస్య తీర్థేషు ప్రతిపాదనీ చ! తస్యామాయత్తా లోకయాత్రా!!  

(కౌటిలీయం -1-4) 

లోకయాత్ర (సమాజ జీవన వ్యవస్థ(The Social Life System)) దండనీతిపై ఆధారపడి ఉంటుంది. దండనీతి పాలకులకు ఇంతవరకు సంపాదించుకోని సంపాదనను సంపాదించుకోవడానికి, సమకూర్చుకున్న సంపాదనను కాపాడుకోవడానికి, కాపాడుకున్న సంపదను మరింతగా వృద్ధి చేసుకోవడానికి, వృద్ధి చెందిన ఐశ్వర్యాన్ని సముచిత రీతిలో అర్హులైన పౌరులకు పంచడానికి మార్గం చూపుతుంది. ‘తీర్థేషు‘ అనగా సంపద ఎవరెవరికి ఇవ్వాలి, లేదా ఏయే పనులకు ఎలా వినియోగించాలో తెలియజేసేదని.. అంటారు ఆచార్య చాణక్య(Acharya Chanakya).

ప్రజల సుఖసంతోషాల్లోనే రాజు సుఖం ఇమిడి ఉంటుందని చాణక్యుడు స్పష్టం చేస్తారు. రాజుకు వ్యక్తిగతంగా ఇష్టమైనది తప్పనిసరిగా హితకరమైనది కావాల్సిన అవసరం లేదు.  ప్రజలకు ఏది ప్రియమైనదో, హితమైనదో, ఏది మేలు చేకూరుస్తుందో, ఏది వారి అభ్యున్నతికి దోహదపడుతుందో అదే రాజుకు నిజమైన మేలును, శ్రేయస్సును కలిగిస్తుంది. అదే రాజుకు నిజమైన హితాన్ని సమకూరుస్తుంది లేదా శుభాన్ని ఇస్తుంది, అంటారు.. చాణక్య. వ్యక్తి ఎదుగుదల సమాజాభివృద్ధిగా వికాసం చెందుతుంది.

వ్యక్తి అభివృద్ధి తనలోని సహజ సామర్థ్యాలను గుర్తించి, వాటిని వికసింపజేసుకొని, తన జీవితాన్ని అర్థవంతంగా మలచుకోవడంలో సమగ్రం అవుతుంది. ప్రజలకు ఆహారం, నిద్ర, నివాసం వంటి ప్రాథమిక శారీరక అవసరాలతో పాటు భద్రతకు సంబంధించిన అవసరాలు కూడా నెరవేరాలి. లేనిపక్షంలో ఏ రాజ్యం సుభిక్షంగా వర్థిల్లలేదు. 

అవసరాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఒకనాటి విలాసాలు మరొక కాలానికి అవసరంగా మారవచ్చు. ఒకరి అవసరం మరొకరికి భోగంగా కనిపించవచ్చు. అందుబాటులో ఉండే వనరులను అనుసరించి అవసరాల నిర్వచనం మారుతుంది. ఒక్కొక్కమారు ఒకరి అవసరాలు మరొకరికి వనరుగా కూడా మారవచ్చు. ఒక రైతు పండించిన పంట మరొకరి భోజనానికి అవసరం కావచ్చు.

అలాగే వినియోగదారుని అవసరమే రైతుకు వనరుగా మారి జీవితానికి సుఖసంతోషాలకు మూలమవుతుంది. ఈ అవసరాలు, ఆర్థిక వనరులు పరస్పర పూరకాలుగా విలువల వ్యవస్థను ఆదరించినప్పుడే వాటి వినియోగం విస్తృతమై కుటుంబ, సామాజిక, దేశ, జాతీయ ప్రయోజనాలకు అతీతమైన విశ్వకుటుంబ భావనకు ఆధారభూతమై నిలుస్తుంది. అయితే వనరుల వినిమయం వ్యక్తి నుండి సమష్టి దాకా ప్రయాణం చేసినప్పుడే మానవతా విలువలు కాపాడబడతాయి.  

అలాగే ‘అపత్యదారాన్, మాతాపితరౌ, భ్రాతౄన అప్రాప్తవ్యవహారాన్, భగినీః కన్యాః విధవాశ్చ అబిభ్రతః శక్తిమతః ద్వాదశపణో దండః అని కౌటిల్యుడు (కౌటిలీయం  పేర్కొన్నారు. శక్తి ఉండి కూడా భార్యా, పిల్లలను, తల్లిదండ్రులను, వ్యవహార యోగ్యతరాక బాల్యదశలో ఉండి వివాహం కాని తోబుట్టువులను, విధవలైన సోదరీమణులను పోషించని వారికి జరిమానా విధించాలి అంటారాయన. ఇక్కడ చాణక్య ఉద్దేశ్యం జరిమానా విధించడం కాదు.. పరస్పర ఆధారిత సమాజంలో, అవసరమైన వారికి సామాజిక భద్రతను కల్పించడంగా కనిపిస్తుంది.

జీవన స్థిరత్వం నుంచి ప్రారంభించి, ఆత్మవికాసం ద్వారా జీవిత సార్థకతను సాధించే దిశగా వ్యక్తి పయనించాలి. ఆ క్రమంలో అరిషడ్ వర్గాలకు దూరంగా ఉండే వ్యక్తి ఇంద్రియాలను జయించగలుగుతాడు. ఇంద్రియ నిగ్రహణయే అసలైన విద్యకు, వినయానికి మరియు మానవ పరిపూర్ణతకు, ఆత్మ సాక్షాత్కారానికి మూలంగా చెపుతారు చాణక్య.

ఆచార్య చాణక్య తన అర్థశాస్త్రంలో ఒక సమర్థవంతమైన రాజ్యపాలనకు పునాదిగా సూచించిన పాలనా సూత్రాలు, ఆధునిక నిర్వహణ మరియు మనస్తత్వశాస్త్రవేత్త అయిన ‘అబ్రహం మాస్లో‘, వ్యక్తిగత మానసిక వికాస కోణంలో దర్శించి ప్రతిపాదించిన అవసరాల క్రమానుగత సిద్ధాంతం మధ్య యథాతథంగా కాకపోయినా చాలా పోలికలు కనిపిస్తాయి. 

మానవుడు తన ప్రాథమిక అవసరాలు తీరిన తర్వాతే ఉన్నత స్థాయి మానసిక వికాసం వైపు అడుగులు వేస్తాడని చెపుతారు మాస్లో. కూడు, గుడ్డ, గూడువంటివి ప్రాథమిక శారీరక అవసరాలు అంటారాయన. యాజమాన్య నిర్వహణలో ఉద్యోగికి తగిన వేతనం, విశ్రాంతి సమయం, పని చేయడానికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడం ఈ విభాగంలోకి వస్తాయి. ఆర్థిక, ఉద్యోగ భద్రతలు, జీవితంలో స్థిరత్వం, ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా కల్పించడం లాంటివి భద్రతా అవసరాల క్రిందకు వస్తాయి. 

శారీరక అవసరాలు, భద్రతా అవసరాలను రెంటినీ ప్రాథమిక అవసరాలుగా చెపుతారు మాస్లో. ఆ పిమ్మట కుటుంబం, స్నేహితులు, సమాజంతో అనుబంధం లాంటి అనుబంధ అవసరాలను ప్రస్తావిస్తారు. సంస్థలో స్నేహపూర్వక వాతావరణం, స్ఫూర్తివంతమైన బృందాలు,  పరస్పర సహకారం పెంపొందడం మానసిక అవసరంగా చెపుతాడు. తదుపరి అవసరాలు, గౌరవాభిమానాలను పొందడం. ప్రతి వ్యక్తిలోనూ ఇతరుల నుంచి గుర్తింపు, గౌరవం పొందాలనే ఆకాంక్ష ఉంటుంది.

సంస్థలో ఉద్యోగుల ప్రతిభను గుర్తించడం, ప్రశంసించడం, బాధ్యతలు అప్పగించడం, పదోన్నతులు కల్పించడం వల్ల ఉద్యోగిలో గౌరవాభిమానాలను పొందిన తృప్తి, కార్య సాధనకు ప్రేరణనిస్తుంది. వ్యక్తిలో అంతర్లీనంగా ఉన్న సామర్థ్యాలను సంపూర్ణంగా వికసింపజేసుకోవాలనే ఆకాంక్షను ‘స్వీయసామర్థ్య సంపూర్ణ వికాస అవసరాలు‘ అంటారాయన. సృజనాత్మకతకు అవకాశం, స్వతంత్ర నిర్ణయాధికారం, నూతన ఆలోచనలకు ప్రోత్సాహం, వ్యక్తిగత ప్రతిభా వికాసానికి అవకాశాలు కల్పించడం వల్ల స్వీయసామర్థ్య సంపూర్ణ వికాస అవసరాలు నెరవేరుతాయని భావిస్తాడాయన. 

ఈ ఐదు అంశాలను విడివిడిగా కాకుండా, వ్యక్తి ఎదుగుదలకు పరస్పర సంబంధం కలిగిన అవసరాలుగా పరిశీలిస్తే.. జీవించడానికి అవసరమైన వనరులను సమకూర్చుకోవడం వల్ల జీవన స్థిరత్వం కలుగుతుంది. భద్రతను ఏర్పరచుకోవడం వల్ల నిర్భయత్వం కలుగుతుంది. ఆత్మీయ సంబంధాలను, అనుబంధాలను పెంచుకోవడం వల్ల సామాజిక సమన్వయం జరుగుతుంది.

తన విలువను గుర్తించుకొని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం వల్ల ఆత్మగౌరవం పెరుగుతుంది. తనలోని అంతర్లీన సామర్థ్యాలను వికసింపజేసుకొని జీవితానికి ఉన్నతమైన ప్రయోజనాన్ని కల్పించుకోవడం వల్ల స్వీయసామర్థ్య సంపూర్ణ వికాసం జరిగి వ్యక్తిగత, సంస్థాగత సామర్థ్యం వికసిస్తుంది. 

మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాస సమయంలో తమ గుర్తింపును వెల్లడించకుండా విరాటరాజు కొలువులో వివిధ బాధ్యతలను స్వీకరించారు. మాస్లో సిద్ధాంతాన్ని ఈ సన్నివేశానికి అన్వయించుకుంటే.. అజ్ఞాతవాసం నేపథ్యంలో తమ ‘జీవనావసరాల‘ను తీర్చుకోవడానికి పాండవులు విరాటరాజు కొలువులో ఉద్యోగించారు. అజ్ఞాతవాసం భంగం కాకుండా వ్యవహరించడం వల్ల, ‘భద్రత‘ అవసరాలు తీరాయి. విరాటరాజు కొలువులోని ఇతరులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ఆయా వ్యవస్థల్లో భాగస్వాములవడం వల్ల, అనుబంధ అవసరాలు తీరాయి.

తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి, రాజుగారి విశ్వాసాన్ని పొందారు. దానితో వారి గౌరవ అభిమాన అవసరాలు తీరాయి. తమ సహజ సామర్థ్యాలను, నైపుణ్యాలను తగిన సందర్భంలో ప్రదర్శించడం వల్ల వారి స్వీయసామర్థ్య సంపూర్ణ వికాస అవసరాలు తీరాయి. ధర్మజ భీమ నకుల సహదేవులు దక్షిణ గోగ్రహణ సమయంలో విరాటుని రక్షించారు.

అలాగే అర్జునుడు బృహన్నలగా ఉంటూ ఉత్తర కుమారునికి రథసారథిగా సహకరించి, చివరకు తన యుద్ధవిద్య సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. అయితే ఈ అవసరాలన్నీ ఒక నిర్దిష్ట క్రమంలోనే తీరాలని నియమం లేదు. వ్యక్తుల స్వభావం, పరిస్థితులు, ఆకాంక్షలను బట్టి వాటి ప్రాధాన్యత మారవచ్చు. అయితే వాటిని గుర్తించి, సమన్వయపరచుకొని, తన వ్యక్తిత్వాన్ని నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ ఉన్నతమైన జీవన లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించడం ప్రతి వ్యక్తికీ అవసరం.

మరిన్ని వార్తలు