రాజుతో ఎలా ప్రవర్తించాలి?

07-10-2026 | 05:05am

పాలకుర్తి రామమూర్తి :

ఏకదేశం దహేదగ్నిః 

శరీరం వా పరం గతః!

సపుత్రదారం రాజా తు ఘాతయే

ద్వర్ధయేతవా!

(కౌటిలీయం -5--4)

ఒకరిపై అగ్నిపడితే ఆ అగ్ని వాని దేహాన్ని కొంత కాల్చవచ్చు లేదా మొత్తం శరీరాన్నే కాల్చవచ్చు. కానీ, రాజు(King) తలుచుకుంటే ఒక మనిషిని భార్యాపుత్రులతో సహా నశింపజేస్తాడు. అలాగే అభి వృద్ధిలోకి తీసుకురాగలడు కూడా, అంటున్నాడు ఆచార్య చాణక్య. ‘అగ్నావివ హి సంప్రోక్తా వృత్తి రాజోపజీవినాం’ అంటే రాజును ఆశ్రయించిన వారి జీవన ప్రవృత్తి(Way of life) అగ్నితో చెలగాటం వంటిది అంటారాయన. ‘రాజుల్ మత్తులు వారి సేవ నరక ప్రాయంబు’ అన్నారు ధూర్జటి.

అధికారాన్ని ఆశ్రయించినవారి జీవితం చాలా సున్నితమైనది కాబట్టి అధికారంతో వ్యవహరించే వారు ఆత్మరక్షణ(Self-defense) పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తులై ఉండాలి. రాజ్యసభలో(Rajya Sabha) ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, ఎప్పుడు ఏ విషయాన్ని రాజుతో ముచ్చటించాలో, ఏ విషయాలను ఎలా చెప్పాలో చాణక్య చాలా వివరంగా చెప్పాడు.

రాజ్యసభలో ఉన్నప్పుడు స్వీయ నియంత్రణ, సమయజ్ఞత, వాక్కుల పట్ల సంయమనత, ప్రామా ణిక సమాచారం పట్ల బాధ్యత, నిబద్ధత, రాజనీతి పరిజ్ఞానం చాలా అవసరం. ఒక మంచి సలహా కూడా తప్పుడు సమయం లో చెప్పినట్లయితే సరైన ఫలితం ఇవ్వకపోవచ్చు. అందుకే ముఖ్యమైన సమాచారా న్ని సరైన వ్యక్తికి, సరైన సమయంలో, సరైన పద్ధతిలో అందించడం నాయకత్వ వ్యవస్థలో కీలకమైనది. 

    ‘ప్రవేశించడానికి తగిన ప్రదేశమైనా రాజానుమతి లేకుండా ప్రవేశించవద్దని చెబుతున్నాడు. అసభ్యమైన మాటలు పలకవద్దంటాడు. ప్రత్యక్షంగా తాను చూడని దానిని గూర్చి మాట్లాడకూడదు, అసత్యం పలకకూడదు. అలాగే నమ్మశక్యం కాని దా నిని గురించి మాట్లాడకూడదు. బిగ్గరగా నవ్వడం, పక్కవారితో రహస్యంగా మాట్లాడడం, రాజు మాట్లాడుతున్నప్పుడు అడ్డుప డడం కాని చేయకూడదని చెపుతున్నాడు ఆచార్య చాణక్య.’

    రాజుకు ఉపకరించే విషయాలు అందరూ ఉన్నప్పుడు చెప్పాలి. తనకు సం బంధించినవైనా, ఇతరులకు సంబంధించినవైనా వాటిని దేశకాలాదులు చూచు కొని, సరైన సమయంలో చెప్పాలి. అయి తే సరైన సమయాన్ని ఎలా నిర్ణయిస్తాం? అంటే విషయ ప్రాముఖ్యం, సమయ సం దర్భాలే కాకుండా రాజు సంతోషంగా ఉన్నప్పుడు చెప్పడం ఉత్తమం. రాజుకు ఇష్టంకాని అంశాలపై సమాధానం చెప్పవలసిన సమయంలో మౌనంగా ఉండడం ఉత్తమం.

అధికార కేంద్రానికి దగ్గరగా పనిచేసేవాడు తన వ్యక్తిగత గౌరవ భావాన్ని, సంస్థ ప్రయోజనాన్ని వేరు చేసుకోగలగాలి. ప్రతి విమర్శకూ భావోద్వేగంతో వెం టనే ప్రతిస్పందించకుండా, దాని వాస్తవికతను పరిశీలించి, తగిన సమయంలో తగి న విధంగా స్పందించడం వల్ల నాయకత్వ సంబంధాలు ఆరోగ్యకరంగా నిలుస్తాయి. వెంటనే స్పందించడం వల్ల సంబంధాలు మరింత సంక్లిష్టంగా మారవచ్చు.

ఘోరమైన విషయాలు రాజుకు చెప్పవలసి వస్తే ఇతరుల చేత చెప్పించాలి. తన గురించి ఎవరైనా తప్పులు పలికినా సహించి మౌనంగా ఉండడం మంచిదని కాంగ్లే చెపుతాడు. అయితే ఘోరమైన విషయాన్ని తానే చెప్పకుండా ఇతరుల చేత చెప్పించడం బాధ్యత నుంచి తప్పించుకోవడంలా, పిరికితనంలా అనిపించవచ్చు. అయితే కాంగ్లే వ్యాఖ్యను రాజసభా సందర్భంలో పరిశీలిస్తే, అది సమాచారాన్ని సమర్పించే రాజనీతి పరమైన జాగ్రత్తగా కూడా అర్థం చేసుకోవచ్చు.

    అధికారాన్ని ఆశ్రయించి జీవించేవారికి సమర్థత మాత్రమే సరిపోదు. అధికార స్వభావాన్ని అర్థం చేసుకునే సమయజ్ఞత, ఆటుపోటులను తట్టుకోగలిగే నిగ్రహం, అంకితభావం, నిలకడ, సంయమనత, వా క్పటిమ, సమాచార సేకరణ, విశ్లేషణల పట్ల సరైన అవగాహన, దానిని పంచుకోవడంలో బాధ్యత కూడా అవసరం.

మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే సందర్భంలో వారి పురోహితుడైన ధౌమ్యుడు పాండవులకు కొన్ని సేవాధర్మాలు ఉపదేశిస్తాడు. అప్పటివరకు పాండవులు రాజులుగా చెలామ ణి అవుతున్నవారు. రాజరికపు అభిజాత్యం వారిలో అంతర్లీనంగా తొంగిచూ స్తూనే ఉంటుంది. కానీ వారిప్పుడు విరాటుని కొలువులో సేవకులుగా వ్యవహరిం చవలసి ఉంది. అందువల్ల సేవాధర్మాన్ని వారికి ప్రత్యేకంగా ఉపదేశించవలసిన అవసరం ధౌమ్యునికి ఏర్పడింది.

‘నాహమస్య ప్రియోûస్మీతి మత్వాసేవేత పండితః, అప్రమత్తశ్చ సతతం హితం కుర్యాత్ ప్రియం చ యత్!’ అంటాడు ధౌ మ్యుడు. రాజు ఆత్మీయుడే కావచ్చు. నేను రాజుకు ప్రియుడిని కదా అని భావించి సేవ చేయకూడదు. వివేకవంతుడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి, రాజుకు హి తమైనదానిని, ప్రీతికరమైనదానిని మాత్ర మే చేయాలి. రాజుతో అతిగా చనువు పెంచుకోకూడదు. అలాగని అతిగా అధికారాన్ని ప్రదర్శించకూ డదు.

రాజు సమక్షం లో తన ప్రాముఖ్యాన్ని అతిగా చూపించుకోవడం, ఇతరులపై ఆధిపత్యం ప్రదర్శించడం అనుచితం. అలాగే అడగకుండా అనవసరంగా ఉచిత సలహాలు ఇవ్వకూడదు. అలాగని అవసరమైనప్పుడు రాజు కు హితాన్ని చెప్పడం మరచిపోవద్దు. పలి కే ప్రతి మాట పట్ల జాగ్రత్త, సంయమనత అవసరం. అతిగా మాట్లాడడం, పెద్దగా నవ్వడం, అనవసర సంభాషణలకు దూరంగా ఉండాలి. నిరంతర అప్రమత్తత అవసరం అంటాడు ధౌమ్యుడు.

    సందర్భాలు వేరైనా, కాలాలు వేరైనా చాణక్యుడు తన అర్థశాస్త్రంలో చెప్పి న అంశాలైనా, ధౌమ్యుడు బోధించిన సేవాధర్మ అంశాలైనా ఒకే విషయాన్ని ప్రతిపాదిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. నిజానికి ఇవి ఆధునిక యాజమాని, ఉద్యోగి సంబంధాల్లో ఉద్యోగి ప్రవర్తించాల్సిన విధానానికి కూడా అనువర్తిస్తుంది. ఇక్కడ చాణక్యుడిని దృష్టిలో ఉంచుకొని విశ్లేషణ చేసుకుంటే ఉద్యోగి మాత్రమే జాగ్రత్తగా ఉండాలా? నాయకుడికి బాధ్యత లేదా?‘ అనే ప్రశ్న ఉదయించవచ్చు. దానికి భార తం సభాపర్వంలో నారదుడు ధర్మరాజును కొన్ని రాజనీతి విషయాలను ప్రశ్నిం చిన ఉదంతం సమాధానం ఇస్తుంది. నారదుడు ధర్మరాజును ఈ కింది ప్రశ్నలను అడుగుతాడు.

    సరైన వ్యక్తిని సరైన స్థానంలో పెట్టా వా? సరైన కార్యానికి తగిన అర్హతలు గలిగిన సమర్థుడైన ఉద్యోగిని గుర్తించావా? అతనికి తగిన బాధ్యతతో కూడిన అధికారాన్ని ఇచ్చావా? నిత్యం అతను చేస్తున్న పనులను పరిశీలిస్తున్నావా? నీవు గాని నీ అధికారులు కాని ప్రజలకు అన్యాయపు శిక్షలు వేయడంలేదు కదా? నిజాయతీపరులైన ఉద్యోగులను కాపాడుతున్నావా? ప్రజలపై అధికారుల దుర్వినియోగాన్ని అరికట్టే వ్యవస్థను ఏర్పరచావా? ఇలా సే వకుని పట్ల రాజు అనుసరించ వలసిన ధర్మాన్ని గూర్చిన పలు అంశాలను నారదుడు ప్రశ్నించడం కనిపిస్తుంది. దీనితో సేవకుని ధర్మంతో పాటుగా సేవలను స్వీకరించే అధికారి కూడా బాధ్యతాయుతంగా ఉండాలనే విషయం స్పష్టం అవుతుంది.

    ఆధునిక యాజమాన్య నిర్వహణలోనూ సంస్థ విజయానికి బాధ్యత ఏకప క్షంగా ఉండదు. నాయకుడికి, ఉద్యోగికి మధ్య పరస్పర అవగాహన, అంకితభావనతో కూడిన సమష్టి బాధ్యత, పరస్పర వి శ్వాసం ఉన్నప్పుడే సంస్థాగత ప్రయోజనం నెరవేరుతుంది. నాయకుడు అభ్యర్థుల్లోని అర్హతలను గుర్తించి నియమించడమే కాదు., వారి సమర్థతను గుర్తించి తగిన బా ధ్యతను అప్పగించడం నాయకత్వ బాధ్యతయే. ఆ నైపుణ్యమే నాయకత్వ పటిమకు దర్పణంగా నిలుస్తుంది.

మరిన్ని వార్తలు