అలుపులేని నిశ్శబ్ద విప్ల వ కారుడు

22-11-2026 | 05:15am

ఆర్ కృష్ణయ్య: బీసీ ఉద్యమానికి 50 ఏండ్లు

చుట్టూ చీకటి! అది కాలం చొప్పించింది కాదు.. పరిస్థితుల ప్రభావంతో కమ్ముకున్నది అంతక న్నా కాదు! స్వయంప్రకటిత పెత్తందారుల పైత్యం పెచ్చుమీరి బడుగు బలహీనవర్గాల జీవితాల చుట్టూ ముసురుకున్న తిమిరం అది!! ఆ తిమిరంపై సమరం చేయాలని చిన్నప్పుడే ఆలోచన మెదిలింది ఆర్.కృష్ణయ్యకు. తాను పెరిగిన వాతావరణం నుం చే పోరాట పాఠాలు నేర్చుకున్నారు. అమ్మ రాములమ్మ చెప్పిన ‘జీవితానికి వెలుగిచ్చేది.. జీవితాలకు వెలుగుపంచేది చదువే నన్న మాటలను బలంగా నమ్మారు. ‘నువ్వు నడిచే దారిలో రాళ్లుంటాయి..

ము ళ్లుంటాయి. రాళ్లు వేసేవాళ్లుంటారు.. రాసిరంపాన పెట్టేవాళ్లూ ఉంటారు. నీ సంక ల్పం బలమైనదైతే అవేమీ చేయలేవు’ అంటూ నాన్న అడివప్ప చెప్పిన, చూపిన తొవ్వనెంచుకున్నారు. నిశ్శబ్దంగా తన ఉద్యమాన్ని మొదలుపెట్టిన ఆర్.కృష్ణయ్య విప్లవంగా మారారు. పెత్తందారుల గుండె ల్లో మిసైల్ అయ్యారు. వాళ్ల పైత్యాన్ని అణచివేసి.. బీసీలకు పెద్దదిక్కుగా నిలిచారు. ఐదు దశబ్దాలు పూర్తి చేసుకున్న ఆర్.కృ ష్ణయ్య బీసీ ఉద్యమ ప్రస్థానం ఎన్నో మైలురాళ్లను ముద్దాడింది. ప్రతి బడుగు బలహీనవర్గాల గుండెను తట్టిలేపింది. ప్రశ్నించే తత్వాన్ని ఒంటబట్టించింది.

1976.. అంతకంటే ముందు ఉద్యమ నిర్మాణ దశ. ఆర్.కృష్ణయ్య పట్టుకున్న జెండా.. బీసీ ఎజెండా. జనాన్ని సంఘటితం చేయడం, వారిని ఒక్కతాటి మీదికి తీసుకురావడం కత్తిమీద సాములాంటిది. ఇప్పుడున్నట్లు కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. ఇప్పటిలా సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితేనో, ఒక్క హ్యాష్‌ట్యాగ్ ఇస్తేనో పొలోమంటూ వచ్చే పరిస్థితి కాదు. మారుమూల పల్లెల్లోకి వెళ్లాలి. ప్రతి గడపనూ తాకాలి! బీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలకు కారణాలను యుక్తవయస్సులోనే సమగ్రంగా అధ్యయనం చేసిన ఆర్.కృష్ణయ్య..

ఆ అన్యాయాలకు మూలాలను వెతికే పనిలో పడ్డారు. మూలాల నుంచే దాన్ని పెకిలించాలని నిశ్శబ్దంగా, ఒంటరిగా ఊరూరు తిరిగారు. బీసీల్లో కులాలు అనేకం. ఆలోచనలూ అనేకం.. ఎవరి దారి వారిది, ఎవరి పని వారిది! తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ఎదురిద్దాం అంటే వచ్చేవాళ్లు తక్కువ. వచ్చిన ఆ కొందరు కూడా ముందుకు నడిచేది అంతంతే! అయినా ఎక్కడా ఆర్.కృష్ణ య్య తగ్గలేదు. వెనకడుగు వేయలేదు. ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

దాదాపు ఆరేండ్లు ఉమ్మడి ఏపీలోని అన్ని పల్లెలనూ టచ్ చేశారు. అలా తన ప్రయాణంలో కొందరు తోడయ్యారు. మొదట ‘చూద్దాం లే’ అన్నవారు.. ఆర్.కృష్ణయ్య సంకల్పాన్ని చూసి.. ‘చేద్దాం పదా’ అంటూ కలిసి వచ్చా రు. 1976 నుంచి.. ఆయన ఒక్క పిలుపునిస్తే చాలు వందలు వేలు లక్షల మంది రోడ్లమీదికి రావడం మొదలుపెట్టారు. తమ హక్కుల కోసం బీసీ గళం పాలకులను నిలదీయడం మొదలుపెట్టింది.

చదువుతోనే వెలుగనీ!

బీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలు అంతంకావాలంటే ముందుగా ఆ వర్గాల పిల్లలకు ఉన్నత చదువులు దక్కాలన్నది ఆర్.కృష్ణయ్య ఆలోచన. కన్నతల్లి రాములమ్మ బాల్యంలో తనకు చెప్పిన మాటలు గుర్తుచేసుకొని.. అదే బాటను ఎంచుకున్నారు ఆయన. బీసీ పిల్లలు చేయాల్సింది కులవృత్తులు కాదు.. డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఉపాధి కలిపించే కంపెనీలకు ఓనర్లుగా రాణించాలని, ఇందుకోసం విద్యలో అవకాశాల కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకొని ఆ దిశగా ఉద్యమించారు.

పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టి, మంచి చదువులు చెప్పించేలా హాస్టళ్లను ఏర్పాటు చే యాలని అన్ని జిల్లాల కలెక్టరేట్లతోపాటు అసెంబ్లీని ముట్టడించారు. ఆ ఉద్యమ ఫలితంగా 1976 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి హాస్టళ్ల సంఖ్య 600 నుంచి 5వేలకు పెరిగింది. హాస్టళ్లలో మెస్ చార్జీలు పెంచాలని, సౌకర్యాలు క ల్పించాలని 1978 సెప్టెంబర్ 27న ఆర్.కృ ష్ణయ్య చేపట్టిన ‘ఛలో అసెంబ్లీ’ ధాటికి రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలను నాటి పాలకులు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

2008లో అమలులోకి వచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ వెనుక ఆర్.కృష్ణ య్య చేసిన పోరాటం ఉంది. ఇంటర్ సహా వృత్తి విద్యా కోర్సుల ఫీజులను ప్రభుత్వ మే చెల్లించాలంటూ 2004 నుంచి 2007 వరకు వరుసగా నాలుగేండ్లు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టారు. న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఆమరణ నిరాహార దీక్షను కూడా ప్రకటించడంతో.. నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతీసుకొని నాటి మంత్రి రఘువీరారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు.

ఆ సంఘం ముందు ఆర్.కృష్ణయ్య 16 డిమాండ్లు పెట్టారు. చదువులకయ్యే ఫీజులన్నీ ప్రభుత్వమే భరించాలన్నది ప్రధాన డిమాండ్. అన్నింటినీ పరిశీలించిన వైఎస్సార్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ప్రకటించింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ స్కీమ్ అమలవుతున్నదంటే అది ఆర్.కృ ష్ణయ్య ఉద్యమ ఫలితమే. ఇప్పటికీ తెలంగాణలో కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో కానీ ఫీజు బకాయిలు విడుదల కాకపోతే 72 ఏండ్ల వయసులోనూ ఆయన ముందుకు వచ్చి పాలకులను నిలదీస్తున్నారు.

విద్యలోనే కాదు ఉద్యోగాల్లోనూ బీసీలకు అవకాశాలు, రిజర్వేషన్ల కోసం ఆర్.కృష్ణయ్య పో రాటం చేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ హయాంలో 20 శాతం నుంచి 44 శాతానికి ఈ రిజర్వేషన్లు సాధించారు. అటు కేంద్రంలో మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయించడంలోనూ కీలక పాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లకు అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం అంగీకరించగా.. కొందరు అగ్రవర్ణ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఆ కుట్రలను పసిగట్టిన ఆర్.కృష్ణయ్య తెలుగు నేల నుంచే పార్లమెంట్ కు భారీ ప్రదర్శన చేపట్టారు. దాదాపు 2వేల మందితో పార్ల మెంట్ ముందు నిరసనకు దిగారు. ఆ తర్వాత మండల్ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లి.. వాదోపవాదాల తరువాత చివరికి మూడేండ్లకు బీసీలకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

మేమెంతో మాకూ అంత!

‘జిత్నీ ఆబాదీ.. ఉత్నీ హక్’ అనే నినా దం ఇప్పుడు మనకు బాగా వినిపిస్తున్నది. ఈ పిలుపును నాలుగు దశాబ్దాల కిందటే ఎత్తుకున్నారు ఆర్.కృష్ణయ్య. బీసీలం ‘మేమెంతో మాకూ అంత’ అంటూ రాజకీయాల్లో కోటా కోసం ఉద్యమించారు. 1980లో టి.అంజయ్య ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారు. రిజర్వేషన్లకు నాడు అంజయ్య సర్కార్ అంగీకరించినప్పటికీ ఆతర్వాత ఆ ప్రభుత్వం మారడంతో తిరిగి 1986లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ముందుకువచ్చింది.

ఆర్.కృష్ణ య్య హైదరాబాద్‌లో భారీ సభ పెట్టి.. రిజర్వేషన్లు దక్కే వరకు ఉద్యమాన్ని ఆపబో మంటూ అక్కడే కూర్చున్నారు. దానికి స్పందించిన ఎన్టీఆర్ ప్రభుత్వం.. స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లకు ఓకే చెప్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ లోకల్ బాడీ ల్లో రిజర్వేషన్లకు అడుగు పడింది. వాటిని ఇంకా పెంచాలని 1991 లో విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీ ముట్టడికి ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు.

దీంతో నాటి రెవెన్యూ మంత్రి రాంరెడ్డి చైర్మన్ గా మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి.. 34 శాతం రిజర్వేషన్లకు అంగీకరించింది. ఫలితంగా లోకల్ బాడీల్లో బీసీల రాజ్యాధికా రానికి పునాదిపడింది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం ఆర్. కృష్ణయ్య చేసిన పోరాటాన్ని అడ్డుకునేందుకు కొన్ని అగ్రవర్ణాల శక్తులు కుట్రలు చేశాయి. ‘నవ సంఘర్షణ సమితి’ పేరిట కుయుక్తులు పన్నాయి. దాడులు చేయించాయి. ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో బీసీ లు వాటిని సంఘటితంగా ఎదిరించారు.

ఇల్లే ప్రజాదర్బార్!

బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయా ల్లో రిజర్వేషన్ల కోసం మాత్రమే ఆర్.కృ ష్ణయ్య ఉద్యమం సాగలేదు. సమాజంలో దురాచారాలకు వ్యతిరేకంగా, అవినీతి చీడపీడకు వ్యతిరేకంగా ఆయన కదంతొక్కారు. ఇప్పటికీ అలుపెరగకుండా పోరాడుతూనే ఉన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కొత్త తరానికి మార్గనిర్దేశనం చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ విద్యానగర్ లోని ఆర్.కృష్ణయ్య ఇంటి తలుపులు బడుగు బలహీన వర్గాల బిడ్డల కోసం తెరిచే ఉంటాయి. అక్కడ జరిగే ప్రజాదర్బార్ లో రోజూ వందల మంది తమ గోస చెప్పుకోడానికి వస్తుంటారు. 72 ఏండ్ల వయసులోనూ ఏ మాత్రం అలసిపోకుండా ఆర్.కృష్ణయ్య అందరి బాధను ఆలకిస్తూ ఉన్నారు. ‘నేనున్నా’నన్న భరోసా ఇస్తున్నారు. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తూ ఉన్నారు.

- వ్యాసకర్త : జీవన రాధ తెలుగు అధ్యాపకురాలు, సెల్: 8790379623

మరిన్ని వార్తలు