తెరపైకి సోనియా బయోపిక్!
మోనికా బెల్లూచీని కథానాయికగా అనుకున్న దర్శకుడు జగ్మోహన్ ముండ్రా
- కాంగ్రెస్ నుంచి న్యాయపరమైన అభ్యంతరాలు
- 20 ఏళ్ల తర్వాత మళ్లీ పాత సినిమాపై చర్చ
సినిమా ప్రపంచంలో కొన్ని ఆసక్తికరమైన కాంబినేషన్లు అనూహ్య కారణాలతో కార్యరూపం దాల్చవు. అలాంటి అరుదైన ప్రయత్నమే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించాలనుకున్న బయోపిక్. ఈ చిత్రంలో సోనియా గాంధీ పాత్రను పోషించేందుకు ప్రపంచ అందగత్తెగా గుర్తింపు పొందిన ఇటలీ నటి మోనికా బెల్లూచీని ఎంపిక చేయడం అప్పట్లో అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఎన్నో అంచనాల మధ్య ప్రకటించిన ఈ సినిమా చివరకు పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సోనియా గాంధీ ఆత్మకథ విడుదల నేపథ్యంలో ఈ పాత బయోపిక్ వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది.
సోనియా పాత్రలో మోనికా బెల్లూచీ!
2005లో లాస్‌ఏంజెలెస్‌కు చెందిన భారతీయ మూలాలున్న దర్శకుడు జగ్మోహన్ ముండ్రా(Jagmohan Mundhra) సోనియా గాంధీ(Sonia Gandhi) జీవితంపై సినిమా రూపొందించనున్నట్లు ప్రకటించారు. ‘సోనియా’ అనే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించారు. ప్రముఖ ఇటాలియన్ నటి మోనికా బెల్లూచీని టైటిల్ పాత్రకు సంప్రదించగా, ఆమె కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపినట్లు అప్పట్లో నిర్మాత సునంద మురళీ మనోహర్ వెల్లడించారు. మోనికా బెల్లూచీకి అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. పలు అంతర్జాతీయ మ్యాగజైన్లు ఆమెను ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా అభివర్ణించాయి. అలాంటి నటి సోనియా గాంధీ పాత్రలో కనిపించనుండటంతో అప్పట్లో ఈ ప్రాజెక్టుపై భారీ ఆసక్తి నెలకొంది.
సోనియా జీవితంలోని కీలక ఘట్టాలతో కథ..
ప్రముఖ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ రచించిన ‘సోనియా: ఎ బయోగ్రఫీ’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాలని భావించారు. ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్ర కోసం భారతీయ నటి పెరిజాద్ జొరాబియన్ను కూడా ఎంపిక చేసినట్లు అప్పటి వార్తా కథనాలు వెల్లడించాయి. సుమారు ఏడు మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో భారత్, ఇటలీ, బ్రిటన్లలో చిత్రీకరణ జరిపి 2006లో విడుదల చేయాలనేది ప్రణాళిక.
కాంగ్రెస్ నుంచి న్యాయపరమైన అభ్యంతరాలు
ఈ సినిమా ప్రకటన వెలువడిన కొద్దికాలానికే కాంగ్రెస్ పార్టీ నుంచి న్యాయపరమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చిత్ర కథలో వాస్తవాల ప్రాతిపదిక, సోనియా గాంధీ జీవితాన్ని ఎలా చిత్రీకరించబోతున్నారు అనే అంశాలపై వివాదం తలెత్తింది. దీంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. మోనికా బెల్లూచీ సైతం 2012లో ఈ సినిమా గురించి స్పందించారు. తనను సోనియా గాంధీ పాత్ర కోసం సంప్రదించిన మాట వాస్తవమేనని, అయితే కథా రచన నచ్చకపోవడంతో తాను ఆ ప్రాజెక్టులో కొనసాగలేదని తెలిపారు. సినిమా ఆగిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని మరో సందర్భంలోనూ పేర్కొన్నారు. దీంతో ఈ బయోపిక్ ఎప్పటికీ తెరకెక్కని ప్రాజెక్టుగా మిగిలిపోయింది.
తాజాగా మళ్లీ సోనియా బయోపిక్ చర్చ!
సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ విడుదలైన నేపథ్యంలో ఆమె జీవితంపై సినిమా తీసే ప్రయత్నాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా తెలుగు చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఇటీవల ప్రకటించారు.
ఈ ప్రాజెక్టును వాణిజ్య ప్రయోజనాల కోసం కాకుండా సోనియా గాంధీ జీవిత ప్రయాణాన్ని ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో రూపొందించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మంచి దర్శకుడిని ఎంపిక చేయడంతో పాటు, అవసరమైన ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా షూటింగ్ ప్రారంభించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. 2028 డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సినిమాను విడుదల చేయాలనే ప్రతిపాదన కూడా ప్రచారంలోకి వచ్చింది.
మరోసారి వినవస్తున్న మోనికా బెల్లూచీ పేరు
ఒకవైపు సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా కొత్త తెలుగు బయోపిక్ నిర్మాణ ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవైపు 20 ఏళ్ల క్రితం ఆమె పాత్రలో నటించాల్సిన మోనికా బెల్లూచీ పేరు మళ్లీ చర్చల్లోకి రావడం విశేషం. అయితే గతంలో ప్రకటించిన ‘సోనియా’ సినిమా, ఇప్పుడు జగ్గారెడ్డి ప్రకటించిన బయోపిక్ రెండూ వేర్వేరు ప్రాజెక్టులు.
పాత సినిమాలో మోనికా బెల్లూచీ నటించలేదు. కొత్త తెలుగు బయోపిక్‌లో ఆమె నటించనున్నట్లు కూడా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అప్పట్లో అంతర్జాతీయ అందాల తారతో సోనియా గాంధీ బయోపిక్ తీయాలన్న ప్రయత్నం విఫలమైనప్పటికీ, ఇప్పుడు ఆమె జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించాలనే కొత్త ప్రయత్నం ఆసక్తిని రేకెత్తిస్తోంది.