ఇందిరమ్మ బీమాకు తాజా మార్గదర్శకాలు

22-11-2026 | 05:15am
  1. నెల రోజులు ప్రత్యేక శిబిరాలు
  2. ఆధార్ కార్డులోని పుట్టిన తేదీయే ప్రామాణికం
  3. రేషన్‌కార్డు నంబరే దరఖాస్తు ఫారం నంబర్
  4. నామినీల సంఖ్యలో వెసులుబాటు
  5. విధివిధానాలు ప్రకటించిన ప్రభుత్వం

నవంబర్ 21 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం(State Government) కొత్తగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(Indiramma Family Life Insurance Scheme) నమోదు ప్రక్రియకు తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్ర ప్రణాళికా శాఖ శనివారం విధివిధానాలను ప్రకటించింది. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా దక్కనుంది. కుటుంబంలో ఒక్కరికే బీమా వర్తిస్తుంది. ఆ వ్యక్తి మరణిస్తే నామినీకి రూ.౫లక్షలు అందిస్తారు. నామినీ నమోదు ఒకరికి మించి అవకాశం కల్పించారు.

ఇక దరఖాస్తుదారుడి వయస్సు 18  59 ఏళ్ల మధ్య ఉండాలి. 1967 నవంబర్ 19  2008 నవంబర్ 18 మధ్య జన్మించిన వారికే అర్హత లభించనుంది. వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు. ఆధార్ కార్డులో పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే, ఆ ఏడాది జూలై 1వ తేదీని పుట్టిన తేదీగా పరిగణిస్తారు. తేదీ తప్పుగా ఉంటే ముందుగా సరిచేసుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. పేర్ల నమోదు ప్రక్రియ కోసం నెల రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు.

గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డులవారీగా శిబిరాలు ఏర్పాటు చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర బలహీన వర్గాల వారికి శిబిరాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. శిబిరాల తేదీలు, వేదికలు, బాధ్యుల వివరాలను ముందుగానే తెలియజేస్తారు. బీమా నమోదు కోసం ఆధార్‌కార్డు, రేషన్ కార్డు (అందుబాటులో ఉంటే), మొబైల్ నంబర్ తప్పనిసరి. రేషన్ కార్డు ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉన్నవారు తమకు కేటాయించిన డీలర్ షాపులో ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. రేషన్ కార్డు నంబరునే దరఖాస్తు ఫారం నంబరుగా పరిగణిస్తారు. ఒక రేషన్ కార్డుపై ఒక దరఖాస్తుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రభుత్వం జారీ చేసిన రేషన్‌కార్డుల ఆధారంగానే నమోదు చేపడతారు. ఇతర జిల్లాలకు చెందిన రేషన్ కార్డుదారులు కూడా సమీపంలోని శిబిరంలో నమోదు చేసుకోవచ్చు. 

సమస్యలుంటే వెనక్కి పంపొద్దు..

నమోదు సమయంలో బీమా పొందే వ్యక్తితో పాటు నామినీల వివరాలను నమోదు చేస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను ఎంపిక చేసుకుంటే, రూ.5 లక్షల పరిహారంలో ఎవరికెంత వాటా ఇవ్వాలనే విషయాన్ని ముందుగానే ప్రకటించాల్సి ఉంటుంది. ఈ వాటాలను శాతాల రూపంలో నమోదు చేస్తారు. మొత్తం వాటా 100 శాతానికి మించకూడదు. ప్రతి నామినీ పేరు, సంబంధం, వయస్సు లేదా పుట్టిన తేదీ వివరాలను నమోదు చేస్తారు. నామినీల్లో ఎవరైనా 18 ఏళ్లలోపు మైనర్లు ఉంటే, వారి తరఫున బీమా పరిహారాన్ని స్వీకరించేందుకు 18 ఏళ్లు నిండిన వ్యక్తిని అపాయింటీగా నియమించాలి.

అపాయింటీ కుటుంబ సభ్యుడే అయి ఉండాలనే నిబంధన లేదు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర బీమా పథకాల ద్వారా కుటుంబాలు పొందుతున్న బీమా సౌకర్యాల వివరాలను కూడా దరఖాస్తులో నమోదు చేస్తారు. కుటుంబ సభ్యులకు నమోదు చేసిన వివరాలను చూపించి, బీమా పొందే వ్యక్తి, నామినీల వివరాలను ధ్రువీకరించుకోవాలని సూచించారు.

ఆన్‌లైన్ వ్యవస్థలో నమోదైన కుటుంబ సభ్యుల జాబితా నుంచి నామినీలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తారు. నమోదు విజయవంతంగా పూర్తయిన ప్రతి లబ్ధిదారుడికి ట్రాన్సాక్షన్ ఐడీతో కూడిన రసీదు సందేశం పంపిస్తారు. నమోదు సమయంలో వివరాల్లో తేడాలు, సాంకేతిక సమస్యలు ఎదురైతే వాటి కారణంగా ఏ కుటుంబాన్నీ వెనక్కి పంపకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 ప్రతి శిబిరంలో ఫిర్యాదులు, సందేహాల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ డెస్క్ లేదా బాధ్యతాయుత అధికారిని నియమించాలి. ఫిర్యాదుల వివరాలు, బాధ్యత వహించే అధికారి, తీసుకున్న చర్యలను రికార్డు చేయాలి. పరిష్కారం కాని సమస్యలను రోజువారీ జిల్లా స్థాయి సమీక్షలో పరిశీలించాలి. రాష్ట్ర స్థాయిలో స్పష్టత అవసరమైన అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. కుటుంబ సమాచారం అందుబాటులో లేకపోయినా, వివరాల్లో సవరణలు అవసరమై నా తగిన మార్గదర్శకత్వం అందించి నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది.

మరిన్ని వార్తలు