చేయూత పింఛన్ల పంపిణీలో ఉద్రిక్తత

22-11-2026 | 05:30am
  1. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో ప్రోటోకాల్ వివాదం
  2. వేదికపై కూర్చున్న కాంగ్రెస్ ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి 
  3. అధికారులను నిలదీసిన బీఆర్‌ఎస్ నేతలు
  4. మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణుల నినాదాలు
  5. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే సబిత జోక్యంతో సద్దుమణిగిన వివాదం

మహేశ్వరం, నవంబర్ 21: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో శనివారం నిర్వహించిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం(Distribution Program for 'Cheyutha' Pensions) తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister for Panchayat Raj, Seethakka) ముఖ్య అతిథిగా హాజరైన ఈ ప్రభుత్వ వేదికపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోవడంతో సభా ప్రాంగణం ఒక్కసారిగా రణరంగంగా మారింది. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వచ్చిన సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు.

మరోవైపు ప్రభుత్వ కార్యక్రమంలో ఎటువంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో లేని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి వేదికపై కూర్చోవడంతో బీఆర్‌ఎస్ నేతలు అధికారులను నిలదీశారు. దీనిపై లక్ష్మారెడ్డి వర్గం ప్రతిఘటించడంతో ఇరుపార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో వేదిక వద్దకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.

స్వల్ప తోపులాట జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం మంత్రి సీతక్క, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్వయంగా కల్పించుకుని, సంక్షేమ కార్యక్రమంలో ఇలాంటి ఘటనలు తగవని ఇరుపార్టీల కార్యకర్తలకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అంతకుముందు మంత్రి హైబ్రిడ్ యాన్యుటీ మోడల ఫేజ్-1 రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. 

మహిళల ఆర్థిక భరోసానే లక్ష్యం: మంత్రి సీతక్క

వివాదం సద్దుమణిగిన అనంతరం పింఛన్ల మంజూరు పత్రాలను అందజేసిన మంత్రి సీతక్క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరైన 4.75 లక్షలకు పైగా పింఛన్ల మొత్తాన్ని ఈ నెల 26న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులతో పాటు ఎయిడ్స్, డయాలసిస్, బోధకాలు, తలసేమియా బాధితులకు పింఛన్లు అందిస్తున్నామన్నారు.

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు మంజూరు చేయడం సంతోషకరమని ప్రభుత్వాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీలత, ఎంపీడీఓ శారదమ్మ, సర్పంచులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు