సఫ్రాన్ 4 వేల కోట్ల పెట్టుబడి

22-11-2026 | 05:20am
  1. ఏరోస్పేస్ రంగంలో విస్తరణకు ఫ్రాన్స్ దిగ్గజ సంస్థ ప్రతిపాదన
  2. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సమ్మిట్‌లో ఎంఓయూకు అవకాశం
  3. ప్రాన్స్‌లో సఫ్రాన్ ప్లాంట్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి
  4. సంస్థ ప్రతినిధులతో భేటీ.. పెట్టుబడులపై చర్చలు
  5. యుద్ధ విమాన ఇంజిన్ల తయారీపై ఆరా

నవంబర్ 21 (విజయక్రాంతి): అంతర్జాతీయ ఏరోస్పేస్ పరిశ్రమలకు(International aerospace industries) కేంద్రంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి అవకాశం దక్కనుంది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ విమాన ఇంజిన్ల తయారీ సంస్థ సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ తెలంగాణలో సుమారు రూ. 4 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. ఇప్పటికే రాష్ర్టంలో కొనసాగుతున్న కార్యకలాపాలను మరింత విస్తరించడంతోపాటు కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటుపై ఆ సంస్థ దృష్టి సారించింది.

ప్రతిపాదిత పెట్టుబడికి సంబంధించి డిసెంబర్ 2026లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలం గాణ గ్లోబల్ సమ్మిట్‌లో అవగాహన ఒప్పందం (ఎంఓ) కుదిరే అవకాశాలున్నాయి. ఇదే అంశంపై ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సఫ్రాన్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. పారిస్ సమీపంలోని ఎవ్రీ-కార్బెల్‌లో ఉన్న సంస్థ తయారీ కేంద్రాన్ని శని వారం ఆయన సందర్శించారు.

సంస్థ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు, సంస్థ కార్యకలాపాల విస్తరణ, కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటుపై చర్చించారు. ప్రపంచ విమానయాన రంగంలో కీలక సంస్థగా గుర్తింపు పొందిన ‘సఫ్రాన్’.. బోయింగ్, ఎయిర్‌బస్ వంటి ప్రముఖ విమాన తయారీ సంస్థలకు అవసరమైన ఇంజిన్లు, విడిభాగాల తయారీ, నిర్వహణ సేవల్లో భాగస్వామిగా ఉంది.

ఇలాంటి అంతర్జాతీయ సంస్థ తన కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించడం వల్ల పెట్టుబడుల ఆకర్షణతోపాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామర్థ్యాల పెంపునకు  దోహదపడే అవకాశం ఉందని భట్టి పేర్కొన్నారు.   

ఇప్పటికే హైదరాబాద్‌లో విస్తృత కార్యకలాపాలు  

సఫ్రాన్ సంస్థకు హైదరాబాద్‌తో ఇప్పటికే బలమైన అనుబంధం ఉంది. లీప్ విమాన ఇంజిన్లకు అవసరమైన రొటేటింగ్ విడిభాగాల తయారీ, సఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ విభాగం కార్యకలాపాలతోపాటు విమాన ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాల్ (ఎంఆర్‌ఓ) సేవలకు సంబంధించిన సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కొత్త పెట్టుబడుల ద్వారా తయారీ కార్యకలాపాలను మరింత విస్తరించాలన్న సంస్థ ఆసక్తి రాష్ట్రానికి అదనపు అవకాశాలను తెచ్చిపెట్టనుంది. సంస్థ కార్యకలాపాలు, పౌర, సైనిక విమానాల ఇంజిన్ల రూపకల్పన, తయారీ, నిర్వహణ విధానాలను సంస్థ ప్రతినిధులు డిప్యూటీ సీఎంకు వివరించారు. 

తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఆధునిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు వేగంగా అనుమతులు కల్పించే విధానాలను ఆయన వివరించారు. డిసెంబర్‌లో జరిగే ‘ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్’కు రావాలని సంస్థ ప్రతినిధులను ఆహ్వానించినట్లు భట్టి తెలిపారు. సమావేశం అనంతరం తయారీ కేంద్రంలోని వివిధ విభాగాలను సందర్శించిన భట్టి.. విమాన ఇంజిన్ల విడిభాగాల తయారీ, అసెంబ్లీ ప్రక్రియలను పరిశీలించారు. రూ.4 వేల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనను ఖరారు చేసేందుకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ సంస్థ ప్రతినిధులతో తదుపరి సంప్రదింపులు జరగనున్నాయి. 

ఈ పర్యటనలో రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తితోపాటు సఫ్రాన్ ఇండస్ట్రియల్ అండ్ సప్లు చైన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లారెంట్ మజౌ, ఇండస్ట్రియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ రొటేటింగ్ పార్ట్స్ డైరెక్టర్ జూలియన్ డీ ఒరాజియో తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు